నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు: సోనియా, రాహుల్‌ గాంధీపై ఎఫ్​ఐఆర్​..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్‌లపై క్రిమినల్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు దిల్లీ పోలీసులు తాజాగా కొత్త ఎఫ్​ఐఆర్​ను నమోదు చేశారు.

Published on: Nov 30, 2025, 10:04:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై క్రిమినల్ కుట్ర అభియోగాలను నమోదు చేశారు. దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) గాంధీలతో పాటు మొత్తం ఆరుగురిపై తాజాగా దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​లో ఈ అభియోగాలు ఉన్నాయి.

సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ.. (HT_PRINT)
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ.. (HT_PRINT)

ఎఫ్‌ఐఆర్‌లో నిందితులు..

తాజాగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో శ్యామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులతో పాటు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఐ), యంగ్ ఇండియన్, డొటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు కంపెనీల పేర్లను కూడా చేర్చారు.

ప్రస్తుతం ఆగిపోయిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే మాతృ సంస్థ అయిన ఏజేఎల్​ను "మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి" క్రిమినల్ కుట్ర జరిగిందని ఎఫ్‌ఐఆర్ ఆరోపిస్తోంది.

కోల్‌కతా కేంద్రంగా ఉన్నట్లు ఆరోపిస్తున్న డొటెక్స్ మర్చండైజ్ అనే షెల్ కంపెనీ, యంగ్ ఇండియన్ అనే లాభాపేక్ష లేని కంపెనీకి రూ. 1 కోటి ఇచ్చింది. ఈ యంగ్ ఇండియన్‌లో కాంగ్రెస్ నాయకులైన సోనియా, రాహుల్‌లకు కలిపి 76శాతం వాటాలు ఉన్నాయి. ఈ లావాదేవీ ద్వారా, యంగ్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లించి, సుమారు రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులున్న ఏజేఎల్‌పై నియంత్రణ సాధించిందని ఆరోపణలు ఉన్నాయి.

అక్టోబర్ 3 నాటి ఈ ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు నివేదికను దిల్లీ పోలీసులతో పంచుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు ఆధారంగా దాఖలైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ)లోని సెక్షన్ 66(2) ప్రకారం, ఒక నేరాన్ని నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీ ఏ ఏజెన్సీనైనా కోరవచ్చు.

నేషనల్ హెరాల్డ్ కేసులో దిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కి వాయిదా వేసిన మరుసటి రోజు ఈ ఎఫ్‌ఐఆర్ వెలుగులోకి వచ్చింది.

నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వపరం..

నేషనల్ హెరాల్డ్ కేసు 2012 నాటిది! బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి స్థానిక కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే ఏజేఎల్​ను స్వాధీనం చేసుకోవడంలో కాంగ్రెస్ నాయకులు మోసం, విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణ నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు రూ. 90 కోట్ల అప్పు ఉంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సహాయపడే ఉద్దేశంతో, సుమారు 10 సంవత్సరాల కాలంలో 100 వాయిదాలలో ఏజేఎల్‌కు రూ. 90 కోట్లు రుణం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

అయితే కాంగ్రెస్ వాదన ప్రకారం, నేషనల్ హెరాల్డ్ లేదా ఏజేఎల్ ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాయి, అందువల్ల, ఆ రుణాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చారు. ఒక రాజకీయ పార్టీ ఈక్విటీ షేర్లను కలిగి ఉండటానికి చట్టపరంగా అవకాశం లేదు కాబట్టి, 2010లో స్థాపించిన యంగ్ ఇండియన్ అనే లాభాపేక్ష లేని కంపెనీకి వాటిని కేటాయించామని కాంగ్రెస్ తెలిపింది.

ఈ కంపెనీలో గాంధీలు ఒక్కొక్కరు 38 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నారు. మిగిలిన వాటాలను దివంగత మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్ పిట్రోడా, సుమన్ దూబే కలిగి ఉన్నారు.

ఈ విధంగా, యంగ్ ఇండియన్ ఏజేఎల్‌లో మెజారిటీ వాటాదారుగా మారింది. గాంధీ నాయకులు ఇద్దరూ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More