FASTag : టోల్ ప్లాజాల్లో ఇక నగదు లావాదేవీలు బంద్! ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిబంధన..
FASTag : టోల్ ప్లాజాల వద్ద ఇకపై నగదు లావాదేవీలను నిలిపివేయాలని ఎన్‌హెచ్‌ఏఐ యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, ఈ ఏప్రిల్ నుంచే టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలు ఆగిపోతాయి. అంటే, ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజా దాటడం మరింత కఠినతరం అవుతుంది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ముఖ్య గమనిక. టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) యోచిస్తోంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనను అమలులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం దేశంలో టోల్ వసూళ్లలో దాదాపు 98 శాతం ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. మిగిలిన స్వల్ప వాటా యూపీఐ, నగదు రూపంలో వస్తోంది. అయితే, ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లిస్తే రెట్టింపు రుసుము వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీఐ చెల్లింపులకు కూడా సాధారణ ధర కంటే 1.25 రెట్లు ఎక్కువే వసూలు చేస్తున్నారు.
ఎందుకు ఈ మార్పు?
ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో సాధించిన పురోగతిని మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రతిపాదనని పరిశీలిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రతిపాదనతో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి..
ట్రాఫిక్ కష్టాలకు చెక్: నగదు చెల్లింపుల వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోందని, ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తోందని ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. కొత్త నిబంధనతో రద్దీ గణనీయంగా తగ్గనుంది.
వేగవంతమైన ప్రయాణం: నగదు రహిత లావాదేవీల వల్ల వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాల వద్ద యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ 734 సెకన్ల నుంచి 47 సెకన్లకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.
పారదర్శకత: డిజిటల్ లావాదేవీల వల్ల టోల్ వసూళ్లలో స్పష్టత రావడంతో పాటు చిల్లర సమస్యలు లేదా ఇతర వివాదాలకు తావుండదు.
2026 చివరి నాటికి 'బారియర్ లెస్' టోల్!
హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'బారియర్-ఫ్రీ' (అడ్డంకులు లేని) టోల్ వసూళ్ల వ్యవస్థను కొన్ని ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే ప్రారంభించింది. 2026 చివరి నాటికి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను ఈ బారియర్-లెస్ విధానం కిందికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడే టోల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
ఫాస్టాగ్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలేంటి?
ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతతో పనిచేసే ఒక పరికరం. దీనిని వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. వాహనం కదులుతున్నప్పుడే.. దీనికి అనుసంధానించిన బ్యాంక్ ఖాతా లేదా వాలెట్ నుంచి టోల్ రుసుము నేరుగా కట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 750కి పైగా టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
దీని వల్ల టోల్ ప్లాజా వద్ద ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరమే లేదు.
దీని వల్ల ప్రయాణికులకే కాదు టోల్ ప్లాజా ఆపరేటర్లకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల ఆపరేటర్లకు ఆపరేషనల్ ఖర్చులు తగ్గుతాయి, కేంద్రీకృత యూజర్ అకౌంట్ల ద్వారా మెరుగైన ఆడిట్ జరుగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


