Chef Damu death : పాకశాస్త్ర దిగ్గజం, పద్మశ్రీ గ్రహీత చెఫ్ దాము కన్నుమూత

ప్రసిద్ధ తమిళ సాంప్రదాయ వంటల నిపుణుడు, 'కూకు విత్ కోమాలి' టీవీ షోతో ప్రతి ఇంటా అభిమానాన్ని సంపాదించుకున్న పద్మశ్రీ చెఫ్ కే దామోదరన్ (దాము) చెన్నైలో కన్నుమూశారు. పాకశాస్త్రంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ చెఫ్‌గా, గిన్నిస్ రికార్డు హోల్డర్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.

Published on: Oct 25, 2026, 13:15:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దక్షిణ భారత పాకశాస్త్ర సౌరభాలను ప్రపంచ నలుమూలలకూ వ్యాప్తి చేసిన దిగ్గజం, తమిళనాడు బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన చెఫ్ 'దాము అప్ప'.. పద్మశ్రీ కే దామోదరన్ (72) ఆదివారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హఠాన్మరణం చెందారన్న వార్త తెలిసి ఫుడ్​ లవర్స్, సినీ వినోద ప్రపంచం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

చెఫ్​ దాము కన్నమూత
చెఫ్​ దాము కన్నమూత

చెఫ్ దాముకు భార్య, పిల్లలు ఉన్నారు.

'కూకు విత్ కోమాలి' వంటి డబ్బింగ్ షోల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా దాముకు తెలుగు రాష్ట్రాల్లోనూ అపారమైన అభిమానగణం ఉంది. వంట చేయడం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక అత్యున్నతమైన కళ అని నిరూపించిన వ్యక్తి ఆయన.

చెఫ్ దాముకు కన్నీటి నివాళి..

చెఫ్ దాము మరణవార్తను ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉన్న తోటి ప్రముఖ చెఫ్ వెంకటేష్ భట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధ్రువీకరించారు. తీవ్ర వేదనకు గురైన ఆయన ఇన్​స్టాగ్రామ్ వీడియో ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ..

"పద్మశ్రీ చెఫ్ దాము గారు ఇక మన మధ్య లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. క్యాటరింగ్ వృత్తిలో ఉన్న వేలాది మందికి ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. సాధారణ వంట మనిషి కూడా ఈ దేశంలో అత్యున్నతమైన 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకోగలడని నిరూపించిన గొప్ప వ్యక్తి ఆయన! 26కు పైగా పుస్తకాలు రాసి, తమిళ సాంప్రదాయ వంటకాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. గత 15 ఏళ్లుగా మేమిద్దరం మంచి స్నేహితులం, సహచరులం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెల్లో పదిలంగా ఉంటాయి," అని వెంకటేష్ భట్ పేర్కొన్నారు.

అటు సోషల్ మీడియాలోనూ, సినీ ప్రపంచంలోనూ అభిమానులు, డిజిటల్ క్రియేటర్లు చెఫ్ దాముకు నివాళులు అర్పిస్తున్నారు. "ఆయన కేవలం ఒక చెఫ్ మాత్రమే కాదు.. తమిళ ఇళ్లలో ఒక ఎమోషన్. వంటను చాలా సరళంగా, అందరికీ అర్థమయ్యేలా నేర్పిన గొప్ప కళాకారుడు," అని ఫుడ్ ఇన్​ఫ్లుయెన్సర్లు కొనియాడుతున్నారు.

డిష్ వాషర్ స్థాయి నుంచి పీహెచ్‌డీ, పద్మశ్రీ వరకు..

1954 సెప్టెంబర్ 3న జన్మించిన దామోదరన్ ప్రయాణం అత్యంత కష్టాలతో కూడుకున్నది! కెరీర్ ప్రారంభంలో హోటళ్లలో పాత్రలు కడిగే 'డిష్ వాషర్'గా పనిచేసిన ఆయన, సొంత కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో చదువుకున్న ఆయన, తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉద్యోగంలో చేరారు.

అనంతరం 2004లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి 'హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ' విభాగంలో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. పాకశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన తొలి భారతీయ చెఫ్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 2008-2011 మధ్య కాలంలో తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు ఏకంగా 1,40,000 మంది వంట సిబ్బందికి ఆయన ప్రత్యేక శిక్షణ నిచ్చారు.

భారతీయ వంటగదిలో ఆయన చేసిన నిరంతర కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 2025 జనవరిలో 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది!

గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. నాన్‌స్టాప్ వంటల జాతర!

చెఫ్ దాము కేవలం రుచులకే కాదు, రికార్డులకూ వేదికగా నిలిచారు:

24 గంటల మెగా రికార్డు: డిసెంబర్ 2010లో ఏకధాటిగా 24 గంటల 30 నిమిషాల 12 సెకన్ల పాటు వంట చేసి, 190 కిలోల బరువు కలిగిన 617 రకాల వంటకాలను తయారుచేసి 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించారు.

మధురై దోశ అండ్ సింగపూర్ కర్రీ: మధురైలో 14.7 మీటర్ల అతిపెద్ద దోశను, సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ కర్రీని తయారుచేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

బులితెర 'దాము అప్ప'గా చెరగని ముద్ర..

ఎన్ని రికార్డులు సాధించినా సామాన్య ప్రేక్షకులకు ఆయన 'విజయ్ టీవీ'లోని ప్రముఖ కామెడీ కుకింగ్ షో 'కూకు విత్ కోమాలి' జడ్జీగానే ఎంతో దగ్గరయ్యారు. 2019 నుంచి దాదాపు ఏడు సీజన్ల పాటు ఆయన ప్రదర్శించిన హాస్యం, చిన్నపిల్లల మనస్తత్వంతో పోటీదారులను ప్రోత్సహించే తీరు ఆయనకు 'దాము అప్ప' అనే పేరు తెచ్చిపెట్టింది.

తమిళంలో కొన్ని సినిమాల్లోనూ ఆయన నటించి మెప్పించారు.

గతంలో ఆరోగ్యంపై ఏప్రిల్/ఆగస్టు మాసాల్లో కొన్ని వదంతులు రాగా, కాలికి ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే షోలో కనిపించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే, శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆయన మృతి పాకశాస్త్ర రంగానికి తీరని లోటు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More