ఈ సేఫ్టీ పిన్ ధర రూ. 69,000 అంటే నమ్మగలరా?

మీరు వాడే సేఫ్టీ ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ.5! సెట్​గా కొంటే రూ.50 దాటదు! కానీ ఈ సేఫ్టీ పిన్​ ధర ఏకంగా రూ. 69వేల వరకు ఉంటందంటే మీరు నమ్మగలరా? సోషల్​ మీడియాలో ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది..

Published on: Nov 8, 2025, 10:45:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోజువారీ అవసరాల వస్తువులను తీసుకొని, వాటిని భారీ ధరకు మార్కెట్లోకి తీసుకురావడంపై లగ్జరీ బ్రాండ్‌లు కొత్తగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది! డిజైనర్ పేపర్ బ్యాగులు, చెప్పులు, లంచ్‌బాక్స్‌ల తర్వాత.. ఇప్పుడు లగ్జరీ సేఫ్టీ పిన్స్ మార్కెట్​లో కొత్తగా విడుదలై వార్తల్లో నిలిచాయి. వీటి ధర తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే! ప్రాడా అనే సంస్థ ఏకంగా 775 డాలర్లకు (రూ. 68758) ఒక సేఫ్టీ పిన్​ని తీసుకొచ్చింది.

ఈ సేఫ్టీ పిన్ ధర దాదాపు రూ. 69,000 అంటే నమ్మగలరా? (Google)
ఈ సేఫ్టీ పిన్ ధర దాదాపు రూ. 69,000 అంటే నమ్మగలరా? (Google)

సేఫ్టీ పిన్​ ధర రూ. 69వేలు!

ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్ అయిన ప్రాడా.. “క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్” అని పిలుస్తున్న ఒక వస్తువును విడుదల చేసింది. ఇది ప్రాథమికంగా, రంగురంగుల క్రోచెట్ దారంతో చుట్టిన సాధారణ సేఫ్టీ పిన్. దానికి పైన సిగ్నేచర్ ప్రాడా ట్రయాంగిల్ లోగో చార్మ్​ని యాడ్​ చేశారు. దీని ధర 775 డాలర్లు.

భారతదేశంలో.. సాధారణంగా 20 నుంచి 30 సేఫ్టీ పిన్‌లు ఉండే ప్యాక్ సాధారణంగా రూ. 20 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఇవి ప్రతి మహిళల యాక్సెసరీ పౌచ్‌లో తప్పనిసరిగా ఉండే వస్తువు. సాధారణంగా దుపట్టా లేదా చీరను సరిగ్గా ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు.

కాబట్టి, ప్రాడా దాదాపు రూ. 69,000కి ఒక పిన్‌ను అమ్ముతోందని సోషల్ మీడియా గుర్తించినప్పుడు.. ఊహించినట్టుగానే నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"ధనవంతులు.. డబ్బుతో ఏం చేస్తున్నారు?"

BlackSwanSazy అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ.. ప్రాడా కొత్త ఉత్పత్తిపై ఒక మహిళ ప్రతిస్పందనను చూపిస్తూ ఒక వీడియోను పంచుకుంది."ఇది 775 డాలర్లు విలువైన సేఫ్టీ పిన్ బ్రూచ్," అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. "నేను మళ్లీ ధనవంతులను అడుగుతున్నాను, 'మీ డబ్బుతో మీరు ఏం చేస్తున్నారు?'" అని ఆమె ప్రశ్నించింది. "మీకు ఏమీ తోచకపోతే చెప్పండి, మాకు చాలా ఐడియాలు ఉన్నాయి," అని ఆమె పేర్కొంది.

ఈ సేఫ్టీ పిన్​ వ్యవహారంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వ్యంగ్య వ్యాఖ్యలతో నిండిపోయాయి.నేను ప్రాడా కీ లేకుండానే దీన్ని తయారు చేయగలను," అని ఒక నెటిజన్​ కామెంట్​ చేశారు.

"లగ్జరీ బ్రాండ్‌లు మమ్మల్ని ఆటపట్టిస్తున్నాయా?" అని ఇంకొకరు ప్రశ్నించగా, "మా అమ్మమ్మ దీనికంటే మెరుగ్గా చేస్తుంది," అని మరొకరు చమత్కరించారు.

ఒక 'ఎక్స్​' (ట్విట్టర్) వినియోగదారుడు ఇలా జోక్ చేశాడు: "ప్రాడా నిజంగానే క్రోచెట్ సేఫ్టీ పిన్స్‌ను రూ. 70వేలకి అమ్ముతోంది. మా అమ్మమ్మ 'సాస్-బహు' సీరియల్స్ చూస్తూ వీటిని తయారు చేసేది."

"ప్రాడా క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్ 775 డాలర్లు. అది ఇత్తడి, పత్తితో తయారైంది. ఎవరైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారా? నేను మీ కోసం దీన్ని బంగారం, వెండితో చేసి ఇస్తాను," అని మరొక నెటిజన్​ పేర్కొన్నారు.

"భారతదేశంలో ఇలాంటి పిన్ కేవలం రూ. 1 కే దొరుకుతుంది, కానీ ప్రాడా మాత్రం దీన్ని హై-ఫ్యాషన్ యాక్సెసరీగా మార్చి అమ్మేస్తోంది," అని ఇంకొకరు అన్నారు.

ప్రాడాకు ఇది మొదటిసారి కాదు..

రోజువారీ వస్తువులను రీప్యాకేజింగ్ చేసినందుకు, ముఖ్యంగా భారతీయ సంస్కృతికి సంబంధించిన వాటిని ప్రవేశపెట్టినందుకు ప్రాడా ఇంతకుముందు కూడా విమర్శలు ఎదుర్కొంది. గతంలో, మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో భారతదేశపు సంప్రదాయ కోల్హాపురి చప్పల్స్​ను పోలి ఉండే పాదరక్షలను ప్రవేశపెట్టినందుకు ఆ బ్రాండ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఆ చెప్పులను "లెథర్ ఫుట్‌వేర్"గా అభివర్ణించారు. దాదాపు పోలిక ఉన్న ఓపెన్-టో బ్రైడెడ్ ప్యాటర్న్‌ను కలిగి ఉన్నప్పటికీ, వాటి భారతీయ మూలాన్ని ప్రస్తావించలేదు.

ఈ గుర్తింపు లేకపోవడం ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. డిజైన్లను దొంగిలించారని వినియోగదారులు బ్రాండ్‌ను ఆరోపించారు.ఈ వివాదం స్వదేశంలో అసలైన కోల్హాపురి చెప్పుల అమ్మకాలను పెంచడం విచిత్రం!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More