Satvik Sairaj: బ్యాడ్మింటన్‌ను పట్టించుకోరు.. క్రికెట్, రాజకీయాలే కావాలి.. నా పిల్లలను ఈ ఆటకు దూరంగా ఉంచుతా: సాత్విక్
Satvik Sairaj: థామస్ కప్‌లో పతకాలు సాధించినా భారతీయుల నుంచి ఆశించిన గుర్తింపు లభించకపోవడంపై స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం విమానాశ్రయంలో ఒక పలకరింపు కూడా కరువైందని, తోటి ఆటగాళ్లు క్యాబ్‌లు బుక్ చేసుకుని వెళ్తుంటే గుండె తరుక్కుపోయిందని వాపోయారు.
Satvik Sairaj: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో స్వర్ణ యుగాన్ని నడిపిస్తున్న ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి. ప్రపంచ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ఈ జోడీ మనసు ఇప్పుడు తీవ్రంగా గాయపడింది. థామస్ కప్‌లో భారత్‌కు పతకాలు తెచ్చినా, స్వదేశంలో కనీస ఆదరణ లభించకపోవడం వారిని కుంగదీస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాత్విక్ వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది.

ఎయిర్‌పోర్ట్‌లో పలకరించే నాథుడే లేడు
సాధారణంగా క్రికెటర్లు విమానాశ్రయానికి వస్తే వేల సంఖ్యలో జనం తరలివస్తారు. కానీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల స్థాయిలో పతకాలు తెచ్చిన బ్యాడ్మింటన్ వీరులకు మాత్రం దారుణమైన పరిస్థితి ఎదురైంది.
"మేము జర్మనీ నుంచి హైదరాబాద్‌కు ఏడు గంటల ప్రయాణం చేసి వచ్చాం. మేము థామస్ కప్ జెర్సీలు వేసుకుని ఉన్నా.. ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. అందరూ ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కనీసం 'బాగా ఆడారు' అని చెప్పే ఒక్క గొంతు కూడా వినిపించలేదు" అని సాత్విక్ కన్నీటి పర్యంతమయ్యాడు.
క్యాబ్‌ల కోసం స్టార్ ఆటగాళ్ల నిరీక్షణ
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లయిన హెచ్.ఎస్. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ వంటి వారు ఎయిర్‌పోర్ట్ బయట నిలబడి క్యాబ్‌లు బుక్ చేసుకుంటుంటే చూడలేకపోయానని సాత్విక్ అన్నాడు.
"మాకు కోట్లు కావాలని కోరుకోవడం లేదు. కనీసం ఒక చిన్న పిల్లోడు వచ్చి మీ ఆట బాగుంది అని అన్నా చాలు. కానీ మన దేశంలో క్రీడా సంస్కృతి ఇంకా పెరగలేదు. అందుకే నా పిల్లల్ని భవిష్యత్తులో బ్యాడ్మింటన్ ఆడనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. మానసికంగా బలంగా ఉంటేనే ఈ అవమానాన్ని తట్టుకోగలరు" అని సాత్విక్ సాయిరాజ్ కుండబద్దలు కొట్టాడు.
సెలబ్రిటీలకు ఉన్న విలువ మాకు లేదా?
చిరాగ్ శెట్టి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "సోషల్ మీడియాలో ఎవరో పనికిమాలిన వీడియోలు చేస్తే లక్షల మంది ఫాలోవర్లు వస్తారు. కానీ మేము ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం ఆడుతున్నా కనీస గుర్తింపు ఉండదు. ప్రభుత్వం పథకాలు బాగున్నాయి. కానీ సామాన్య ప్రజలలో ఇతర క్రీడల పట్ల అవగాహన పెరగాలి. 2022లో మేము స్వర్ణం గెలిచినప్పుడే దీనిని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాల్సింది" అని చిరాగ్ పేర్కొన్నాడు.
విమర్శలు చేసేటప్పుడు మాత్రం ముందుంటారు
గెలిచినప్పుడు పట్టించుకోని కొందరు, ఓడిపోయినప్పుడు మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడంలో ముందుంటారని సాత్విక్ ఆరోపించాడు. "ఫ్రాన్స్‌పై ఎందుకు ఓడిపోయారు? కాంస్యం గెలిచి డ్యాన్సులు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బంగారు పతకం గెలవలేదని మాకు ఎక్కువ బాధ ఉంటుంది. తండ్రి వర్ధంతి కోసం ఇంటికి వెళ్తే.. దేశం కంటే కుటుంబమే ఎక్కువైందా అని ట్రోల్ చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే నేను ఎక్స్ నుంచి తప్పుకున్నాను, త్వరలో ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తప్పుకోవచ్చు" అని సాత్విక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సాత్విక్ సాయిరాజ్ చేసిన కామెంట్స్, తాను ఆడే ఆటకు తన పిల్లలను దూరంగా ఉంచుతానన్న అతని ఆవేదన చూస్తుంటే.. దేశంలో క్రికెట్ తప్ప మిగిలిన క్రీడల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సాత్విక్ సాయిరాజ్ ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు?
థామస్ కప్‌లో భారత్‌కు పతకం తెచ్చినా, దేశంలో క్రీడాకారులకు లభించాల్సిన కనీస గుర్తింపు, గౌరవం లభించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
2. థామస్ కప్ అంటే ఏమిటి?
ఇది బ్యాడ్మింటన్‌లో ప్రపంచ దేశాల మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీమ్ ఛాంపియన్‌షిప్. దీనిని బ్యాడ్మింటన్ 'వరల్డ్ కప్'గా పరిగణిస్తారు.
3. సాత్విక్ సోషల్ మీడియాను ఎందుకు వీడాలనుకుంటున్నారు?
అవగాహన లేని కొందరు వ్యక్తులు చేసే నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


