రెండు సూపర్ ఓవర్లు.. సఫారీలకు చెమటలు పట్టించి ఓడిపోయిన ఆఫ్ఘనిస్థాన్.. టీ20 వరల్డ్ కప్‌లో మరో థ్రిల్లర్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ 2026లో మరో థ్రిల్లర్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఏకంగా రెండు సూపర్ ఓవర్లపాటు సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. చివరికి రెండో సూపర్ ఓవర్లో ఓడిపోయింది.
టీ20 ప్రపంచకప్ 2026లో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ 'టై' అయ్యింది. ఆ తర్వాత జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరికి ఈ ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం సాధించింది.

సూపర్ థ్రిల్లర్ మ్యాచ్
క్రికెట్ అభిమానులకు అసలైన మజా పంచే మ్యాచ్ ఇది. బుధవారం (ఫిబ్రవరి 11) అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు అవసరమయ్యాయి.
మొదటి సూపర్ ఓవర్ డ్రామా
టీ20 వరల్డ్ కప్ లో రెండు సూపర్ ఓవర్ల పాటు సాగిన సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. అసలు మ్యాచే కాదు.. తర్వాత మొదటి సూపర్ ఓవర్ కూడా టై కావడం విశేషం. తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 17 పరుగులు చేసింది. ఒమర్జాయ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ సిక్స్ కొట్టడంతో స్కోర్లు మళ్ళీ సమమయ్యాయి.
రెండో సూపర్ ఓవర్ థ్రిల్
తర్వాత రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. డేవిడ్ మిల్లర్ (16) విజృంభణతో 23 పరుగులు చేసింది. 24 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆఫ్ఘన్ టీమ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన గుర్భాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి భయపెట్టాడు. కానీ చివరి బంతి 5 పరుగుల అవసరం కాగా.. అతడు ఔటయ్యాడు. చివరికి 19 పరుగులే చేయగలిగింది. దీంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.
సఫారీల బ్యాటింగ్.. డికాక్, రికెల్టన్ జోరు
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు క్వింటన్ డికాక్ (59), రయాన్ రికెల్టన్ (61) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 3 వికెట్లు తీశాడు.
గుర్భాజ్ విధ్వంసం.. కానీ టై
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే 84 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేపాడు. అయితే చివరి ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్ జట్టు 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


