...
...
Next Story

IT stocks : దుమ్మురేపుతున్న ఐటీ స్టాక్స్! ఇండెక్సే 3.3శాతం జంప్- ఇప్పుడు కొనొచ్చా?

క్వార్టర్ 2 ఫలితాలు అంచనాలను మించడంతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలంగా పుంజుకోవడంతో మంగళవారం ఐటీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు ఏకంగా దూసుకెళుతున్నాయి. మరి ఇప్పుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టొచ్చా? నిపుణుల సూచనలు ఇవి..

Published on: Oct 13, 2026, 10:45:43 IST
Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ట్రేడింగ్​లో ఐటీ రంగానికి చెందిన షేర్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి! దేశంలో ప్రముఖ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు ఓపెనింగ్​లో ఏకంగా 5 శాతం వరకు ఎగబాకాయి. దీనితో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతం మేర పుంజుకుని మార్కెట్లను ముందుండి నడిపించింది.

దుమ్మురేపుతున్న ఐటీ స్టాక్స్! (an AI-generated image for representational purposes)
దుమ్మురేపుతున్న ఐటీ స్టాక్స్! (an AI-generated image for representational purposes)

ఉదయం 10:30 గంటల సమయంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.3శాతం మేర లాభాలతో దూసుకెళుతోంది. అదే సమయానికి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 50 కూడా 0.78 శాతం లాభపడి 22,537 పాయింట్ల వద్ద ట్రేడయింది.

ఐటీ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణాలు ఏంటి?

ఐటీ రంగంలో ఈ అకస్మాత్తు ర్యాలీకి అనేక అనుకూల అంశాలు కలసివచ్చాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ ప్రకటించిన రెండో త్రైమాసిక (క్యూ2ఎఫ్​వై27) బలమైన ఆర్థిక ఫలితాలు, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, ఆసియా మార్కెట్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టాక్స్ స్థిరీకరణ చెందడం ప్రధాన కారణాలుగా నిలిచాయి.

క్యూ2 ఆర్థిక ఫలితాల మెరుపులు:

దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం పెరిగి రూ. 13,884 కోట్లకు (1.4 బిలియన్ డాలర్లు) చేరింది. కంపెనీ రాబడి 11 శాతం పెరిగి రూ. 73,188 కోట్లను తాకింది.

అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ రూపంలో రాబడి అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం పెరిగి 3.72 బిలియన్ డాలర్లకు చేరింది. రూపాయి రూపంలో రాబడి 11.51 శాతం వృద్ధితో రూ. 35,620 కోట్లకు చేరుకోగా, నికర లాభం ఏకంగా 21.18 శాతం పెరిగి రూ. 5,132 కోట్లుగా నమోదైంది. కొత్తగా 3.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకోవడంతో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రాబడి అంచనాను 2.5–4 శాతానికి పెంచింది.

ప్రపంచ మార్కెట్లలో ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికన్ డాలర్ విలువ గత 18 నెలల గరిష్ఠ స్థాయి అయిన 102.6 వద్ద కొనసాగుతోంది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో అత్యధిక భాగం డాలర్లలోనే లభిస్తుంది. డాలర్ బలోపేతమైనప్పుడు విదేశీ మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయం రూపాయి రూపంలో మారినప్పుడు కంపెనీల లాభదాయకతను పెంచుతుంది.

ఏఐ ట్రేడింగ్‌లో తగ్గిన ఉధృతి:

ఇన్నాళ్లూ విపరీతంగా పెరిగిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ స్టాక్స్ గ్లోబల్ మార్కెట్లలో కొద్దిగా మందగించాయి. ఆసియా మార్కెట్లయిన కొరియన్ కోస్పీ సెషన్‌లో 6 శాతానికి పైగా పడిపోగా, తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 2 శాతం పతనమైంది. ఏఐ సాంకేతికతపై కఠినమైన నిబంధనలు తీసుకురావాలని గ్లోబల్ లీడర్లు కోరడం, వాల్యుయేషన్లు మితిమీరిపోవడం ఇందుకు కారణం. దీనితో గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి సాంప్రదాయ ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీల వైపు మొగ్గు చూపారు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

ఐటీ సూచీకి సంబంధించిన కంపెనీల్లో ప్రస్తుత త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, స్వల్పకాలిక ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

"డాలర్ పుంజుకోవడం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి అగ్రగామి సంస్థల మెరుగైన ఫలితాలు, ఏఐ ట్రేడింగ్ సడలింపు భారతీయ ఐటీ షేర్లను నడిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ స్టాక్స్‌ను కలిగి ఉన్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ దిగివచ్చిన ప్రతిసారీ క్రమంగా కొనుగోలు చేయవచ్చు. అయితే స్వల్పకాలిక, మధ్యకాలిక ఇన్వెస్టర్లు భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తగ్గే వరకు వేచి చూడటం మంచిది," అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.

మరోవైపు కొటాక్ నియో ఫండమెంటల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ పోఖర్నా మాట్లాడుతూ.. ఐటీ రంగం వాల్యుయేషన్లు గణనీయంగా తగ్గాయని, చాలా ఆందోళనలు ఇప్పటికే షేరు ధరల్లో ప్రతిబింబించాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినందున, మొత్తం రంగాన్ని కాకుండా ప్రత్యేకంగా కొన్ని మంచి స్టాక్స్‌ను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. ఐటీ విభాగం నుంచి కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లపై ఆయన కొనుగోలు సిఫార్సు అందించారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks