Tesla Roadster : టెస్లా ఫ్లయింగ్ కారు.. ఇండియాలో 'రోడ్​స్టర్​' బుకింగ్స్ షురూ- కళ్లు చెదిరే అమౌంట్!

స్పేస్‌ఎక్స్ రాకెట్ సాంకేతికతతో గాలిలో విన్యాసాలు చేసే సరికొత్త 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును టెస్లా ఆవిష్కరించింది. భారత్‌లో ఈ అద్భుత కారు బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు టోకెన్ అమౌంట్ చెల్లించి రిజర్వ్ చేసుకునే వీలుంది.

Published on: Oct 16, 2026, 14:02:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ఆటోమొబైల్ రంగాన్ని విస్తుపోయేలా చేస్తూ తమ సరికొత్త ‘రోడ్‌స్టర్’ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. గాల్లో ఎగురుతూ సాహసోపేత విన్యాసాలు చేయగల ఈ విప్లవాత్మక ఈవీ కోసం భారతీయ వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత కొనుగోలుదారుల కోసం టెస్లా తమ అధికారిక వెబ్‌సైట్‌లో రోడ్‌స్టర్ బుకింగ్‌లను ప్రారంభించింది.

మూడు వేరియంట్లలో టెస్లా రోడ్​స్టర్..
మూడు వేరియంట్లలో టెస్లా రోడ్​స్టర్..

భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును రిజర్వ్ చేసుకోవడానికి ప్రాథమికంగా రూ. 5.01 లక్షల అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బుకింగ్ ఇక్కడితో పూర్తికాదు. 'పర్ఫార్మెన్స్' మోడల్ కోరుకునే వారు దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా మరో రూ. 45.05 లక్షలు చెల్లించి మొత్తం రూ. 50.06 లక్షల డిపాజిట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక మరింత శక్తివంతమైన 'థ్రస్ట్' మోడల్ కోసం 10 రోజుల్లో రూ. 2.45 కోట్లు అదనంగా చెల్లించి మొత్తం దాదాపు రూ. 2.50 కోట్ల రిజర్వేషన్ మొత్తం దాఖలు చేయాలి.

ఇవి కేవలం అడ్వాన్స్ బుకింగ్ రుసుములు మాత్రమేనని, కారు ఎక్స్-షోరూమ్ ధర, డెలివరీ తేదీలను కంపెనీ త్వరలోనే ప్రకటిస్తుందని స్పష్టం చేసింది.

స్పేస్‌ఎక్స్ రాకెట్ సాంకేతికత.. గాల్లో విన్యాసాలు!

టెస్లా కొత్త రోడ్‌స్టర్ కారులో ప్రధాన ఆకర్షణ.. ఎలాన్ మస్క్​కే చెందిన స్పేస్‌ఎక్స్ భాగస్వామ్యంతో రూపొందించిన 'కంప్రెస్డ్-ఎయిర్ థ్రస్టర్' సాంకేతికత. టెక్సాస్‌లోని పరీక్షా కేంద్రంలో నిర్వహించిన ప్రదర్శనలో ఈ కారు గాల్లోకి లేచి రోల్ అవ్వడం, ఇతర వాహనాల పైనుంచి దూకడం వంటి అద్భుత విన్యాసాలను చేసి చూపించింది.

ఆ వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కారు మూడు ప్రధాన వేరియంట్లలో రానుంది:

పర్ఫార్మెన్స్ : ఇది సాధారణ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ వెర్షన్. దీనికి రాకెట్ థ్రస్టర్లు ఉండవు.

థ్రస్ట్ : కారు వెనుక భాగంలో వేగాన్ని పెంచే ప్రత్యేక ఆక్సిలరేషన్ బూస్టర్లు ఉంటాయి.

రాకెట్ : కారు చుట్టూ 10 ప్రత్యేక ఎయిర్ థ్రస్టర్లతో పూర్తి వైమానిక వ్యవస్థతో వస్తుంది. ఇది కేవలం సింగిల్ సీటర్ వేరియంట్ కాగా, ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే విక్రయిస్తారు. దీనిని సాధారణ రోడ్లపై నడపడానికి ఇంకా అనుమతి లభించలేదు.

గాలిలో తలకిందులుగా ప్రయాణం.. సెకనులో 100 కిమీ వేగం!

టెస్లా అంచనాల ప్రకారం ఈ కారు కేవలం 0.81 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 370 కిలోమీటర్ల కంటే ఎక్కువేనని కంపెనీ వెల్లడించింది. కారు కింద అమర్చిన ఫ్యాన్-పవర్డ్ సక్షన్ సిస్టమ్ ద్వారా 2జీ డౌన్‌ఫోర్స్ ఉత్పత్తి అవుతుంది. ర్యాంప్‌పై కారు తలకిందులుగా డ్రైవ్ చేస్తూ ఈ వినూత్న టెక్నాలజీని టెస్లా నిరూపించింది.

ఈ సూపర్ ఈవీ వాణిజ్యపరమైన ఉత్పత్తిని 2028 నుంచి ప్రారంభించాలని మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు. భారత్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన విపణి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. టెస్లా రోడ్‌స్టర్ రాక దేశీయ సూపర్‌కార్ ప్రేమికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More