సైబర్ మోసాల కొత్త రూపం: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన సైబర్ మోసాలు
బంధన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమమైన 'సైబర్ కాప్', ఎయిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, కొత్త తరహా మోసాల పట్ల ముందుగానే అప్రమత్తం అయ్యేలా కృషి చేస్తోంది.
ఒక నకిలీ పోలీసు అధికారి. ఎప్పుడూ లేని కొరియర్. వాట్సాప్‌లో పెట్టుబడుల పేరుతో నడిచే గ్రూప్. వీటన్నింటికీ ఒకదానికి ఒకటి సంబంధమే లేదనిపిస్తుంది. కానీ అదే వాటిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.

ఉదయం నిద్రలేచిన వెంటనే "ఈరోజు నేను మోసపోతానేమో" అని ఎవరూ అనుకోరు. ముఖ్యమైన కాల్ అనుకుని ఫోన్ ఎత్తుతారు. కొరియర్ వస్తోందని భావించి మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేస్తారు. చెల్లింపు విఫలమైతే, కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతారు. ఈ చర్యల్లో ఏదీ నిర్లక్ష్యంగా చేసినట్లు అనిపించదు. నిజానికి ఇవన్నీ మన రోజువారీ జీవితంలో సహజంగా జరిగే విషయాలే.
అయితే, భారతదేశంలో సైబర్ మోసాల స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేటి మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేయడంపై ఆధారపడటం లేదు. బదులుగా, మీరే స్వయంగా మీ ఖాతాకు యాక్సెస్ ఇచ్చేలా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
సైబర్ మోసాలు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా, విస్తృతంగా మారుతున్న ఈ నేపథ్యంలో, వాటి గురించి అవగాహనే అత్యంత ప్రభావవంతమైన రక్షణగా మారింది. ఈ అవసరాన్ని గుర్తించిన బంధన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమమైన 'సైబర్ కాప్', ఎయిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, కొత్త తరహా మోసాల పట్ల ముందుగానే అప్రమత్తం అయ్యేలా కృషి చేస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
సైబర్ మోసాలు ఇప్పుడు కొద్దిమంది ఇంటర్నెట్ వినియోగదారులకే పరిమితమైన సమస్య కాదు. దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక నేరాల్లో ఇవి ఒకటిగా మారాయి.
2026 జనవరి నాటికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా నమోదైన 24.65 లక్షలకు పైగా ఫిర్యాదుల ఆధారంగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లబోయే ₹8,690 కోట్లకు పైగా నిధులను అడ్డుకోవడం సాధ్యమైంది. అయినప్పటికీ, సైబర్ మోసాల వల్ల కలుగుతున్న నష్టాలు మాత్రం తగ్గడం లేదు.
అధికారిక గణాంకాల ప్రకారం, సైబర్ మోసాల కారణంగా నమోదైన ఆర్థిక నష్టాలు 2021లో ₹551 కోట్లుగా ఉండగా, 2022లో ₹2,290 కోట్లకు, 2023లో ₹7,465 కోట్లకు, 2024లో ₹22,848 కోట్లకు పెరిగాయి. 2025లో కూడా అవి ₹22,495 కోట్ల వద్ద కొనసాగాయి. అంటే కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఈ నష్టాలు దాదాపు 4,000 శాతం పెరిగాయి.
అదే సమయంలో, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదైన ఆర్థిక మోసాల ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021లో 2,62,846గా ఉన్న ఈ సంఖ్య 2022లో 6,94,446కు, 2023లో 13,10,357కు, 2024లో 19,18,835కు, 2025లో 24,02,579కు చేరుకుంది.
ఈ గణాంకాల్లో ఆందోళన కలిగించే అంశం కేవలం డబ్బు పరిమాణం మాత్రమే కాదు. మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనుసరిస్తున్న పద్ధతుల వైవిధ్యం కూడా. ఒకరికి ఆధార్ నంబర్ నేర విచారణలో ఉపయోగించారంటూ ఫోన్ వస్తుంది. మరొకరిని నిజమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలా కనిపించే నకిలీ పెట్టుబడి యాప్‌లో పెట్టుబడి పెట్టమని ప్రలోభపెడతారు. ఇంకొకరు కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో వెతికి చివరికి మోసగాడితోనే మాట్లాడతారు. మరొకరు డబ్బు అందుతుందని భావించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, తెలియకుండానే తమ ఖాతా నుంచి చెల్లింపును ఆమోదిస్తారు.
మొదట చూసినప్పుడు ఈ మోసాలన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే ఒకే విధమైన నమూనా కనిపిస్తుంది. దాదాపు ప్రతి సైబర్ మోసంలోనూ మొదట బాధితుడు ఒక కథను నమ్మేలా చేస్తారు. ఆ తర్వాతే అతని నుంచి డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మోసాల రూపాలు మారుతుంటాయి. కానీ అవి రేకెత్తించే భావోద్వేగాలు మాత్రం పెద్దగా మారవు. కొన్ని భయాన్ని సృష్టిస్తాయి. మరికొన్ని అత్యవసర పరిస్థితిని కల్పిస్తాయి. ఇంకొన్ని లాభాల ఆశ చూపిస్తాయి. మరికొన్ని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటాయి.
అందుకే ఒక్కో మోసాన్ని విడివిడిగా గుర్తుంచుకోవడం కంటే, వాటి వెనుక ఉన్న ఈ సాధారణ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే మోసాల పేర్లు మారినా, మోసగాళ్ల పద్ధతి మాత్రం దాదాపు ఒకటే ఉంటుంది.
ఇదే కారణంగా బంధన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమమైన 'సైబర్ కాప్', ఎయిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన పెంచుతూ, మోసానికి గురయ్యే ముందే హెచ్చరిక సంకేతాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది.
డిజిటల్ అరెస్ట్: భయాన్నే ఆయుధంగా మార్చుకుంటున్న మోసగాళ్లు.
గత ఏడాదిగా దేశవ్యాప్తంగా వార్తల్లో ఎక్కువగా నిలిచిన సైబర్ మోసాల్లో 'డిజిటల్ అరెస్ట్' ఒకటి. ఈ మోసంలో బాధితులకు ఫోన్ చేసి, తాము పోలీసు అధికారులు, సిబిఐ, కస్టమ్స్ లేదా మరో ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులమని నమ్మిస్తారు. అనంతరం వారి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన విచారణలో ఉందని చెబుతారు.
బాధితుడు ఆ విషయాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వకుండా, వరుసగా మాట్లాడుతూనే అతడిలో భయం, ఆందోళన పెంచేలా పరిస్థితిని సృష్టిస్తారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడనివ్వకుండా ఒంటరిగా ఉంచి, చివరికి తమ సూచనలను పాటించేలా ఒత్తిడి తీసుకొస్తారు.
వాస్తవానికి 'డిజిటల్ అరెస్ట్' అనే పేరుతో భారత చట్టాల్లో ఎలాంటి న్యాయ ప్రక్రియ లేదు. అయినప్పటికీ ఈ మోసం వేగంగా విస్తరిస్తోంది. కారణం ఒక్కటే—నిజమైన దర్యాప్తు ఎలా జరుగుతుందో చాలామందికి స్పష్టంగా తెలియకపోవడం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత కొన్నేళ్లుగా డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పలుమార్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.
ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్‌లోనే ఉండాలని ఆదేశించదని, అలాగే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే డబ్బు బదిలీ చేయాలని ఎప్పుడూ కోరదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ మోసంలో సాంకేతికత ఫోన్ కాల్‌ను సాధ్యం చేస్తుంది. కానీ ఆ కాల్ కొనసాగడానికి బాధితుడిలో కలిగించే భయమే కారణమవుతుంది.
ఏఐ ఆధారిత మోసాలు: నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు
డిజిటల్ అరెస్ట్ మోసాలు భయాన్ని ఆసరాగా చేసుకుంటే, ఏఐ (ఏఐ) ఆధారిత మోసాలు నమ్మకాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటాయి.
తెలిసిన వ్యక్తి గొంతు, నిజంగానే అనిపించే వీడియో, వీడియో కాల్‌లో కనిపించే సుపరిచితమైన ముఖం. ఇవన్నీ ఇప్పుడు ఏఐ సాయంతో ఎంతో సహజంగా నకిలీగా రూపొందించడం సాధ్యమవుతోంది. దీంతో తమ కథలను నమ్మించే కొత్త మార్గాలు మోసగాళ్లకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అలాగే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), ఏఐ ద్వారా రూపొందించే డీప్‌ఫేక్ వీడియోలు మరియు సింథటిక్ ఐడెంటిటీలు దుర్వినియోగం అవుతున్నాయని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశాయి. ఇలాంటి సాంకేతికతలను ఉపయోగించి గుర్తింపు ధృవీకరణ వ్యవస్థలను మోసగించి, ఆర్థిక నేరాలకు పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయని హెచ్చరించాయి.
ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం తెలిసిన వ్యక్తి గొంతు వినిపించిందని లేదా పరిచయమైన ముఖం కనిపించిందని మాత్రమే నమ్మేయకూడదు. అనుమానం వచ్చిన ప్రతిసారీ, మరో మార్గంలో స్వతంత్రంగా ఆ సమాచారాన్ని ధృవీకరించుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం.
సందేహాస్పదమైన లింకులు లేదా మెసేజ్‌లను గుర్తించడం ఎంత ముఖ్యమో, వ్యక్తి నిజంగానే అతడేనా అని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యమైంది.
నకిలీ పెట్టుబడి మోసాలు: లాభాల ఆశనే ఉచ్చుగా మార్చే పద్ధతి
ప్రతి సైబర్ మోసం బెదిరింపులతోనే ప్రారంభం కాదు. కొన్ని మోసాలు భారీ లాభాల ఆశతో మొదలవుతాయి. నకిలీ పెట్టుబడి ప్లాట్‌ఫారాలు, క్రిప్టోకరెన్సీ పథకాలు, మోసపూరిత ట్రేడింగ్ గ్రూపులు —ఇవన్నీ బయటకు చూస్తే అత్యంత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.
మొదట బాధితులకు అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. తర్వాత మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహిస్తారు. సందేహాలు వచ్చినా, వెంటనే స్పందించే 'కస్టమర్ సపోర్ట్' ద్వారా నమ్మకం కల్పిస్తారు. కానీ, పెట్టుబడి చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలనుకునే సమయానికి అసలు నిజం బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్లాట్‌ఫారం పూర్తిగా అదృశ్యమైపోతుంది. మరికొన్ని సందర్భాల్లో పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా ఇతర ఛార్జీల పేరుతో మరోసారి డబ్బు చెల్లించాలని కోరుతారు. ఇలాంటి మోసాల వెనుక సంఘటిత నేర ముఠాలు పనిచేస్తున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ₹21 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం దర్యాప్తులో, ఆ డబ్బును 20,507 మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా, 12 దశల్లో వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన, మోసపూరితంగా సేకరించిన నిధులను అనేక ఖాతాల ద్వారా ఎంత వేగంగా మళ్లించవచ్చో స్పష్టంగా చూపిస్తోంది.
సాధారణంగా కనిపించే సైబర్ మోసాలు: కథలు మారినా, మోసగాళ్ల వ్యూహం మాత్రం ఒకటే
ప్రతి సైబర్ మోసం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలవదు. కొన్నిసార్లు అది ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నంబర్ కావొచ్చు. మరికొన్నిసార్లు డబ్బు అందుతుందని భావించి, తెలియకుండానే తమ ఖాతా నుంచి చెల్లింపును ఆమోదించేలా చేసే ఒక క్యూఆర్ కోడ్ కావొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో, ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపించి, తదుపరి పనులు పొందాలంటే ముందుగా డబ్బు చెల్లించాలని చెబుతారు.
మోసాల రూపాలు వేర్వేరుగా కనిపించినా, వాటి లక్ష్యం మాత్రం ఒకటే—బాధితుడిలో అత్యవసర పరిస్థితిని సృష్టించడం, నమ్మకం కల్పించడం, ఏం జరుగుతోందో ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకునేలా చేయడం. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా తమ చర్యలను మరింత విస్తరించింది.
2025 అక్టోబర్ నాటికి సైబర్ మోసాలతో సంబంధం ఉన్న 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులను, అలాగే 2.63 లక్షలకు పైగా మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్లను అధికారులు బ్లాక్ చేశారు. 2025 చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. అప్పటికి 11.14 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2.96 లక్షల IMEI నంబర్లు బ్లాక్ అయ్యాయి. సైబర్ నేరాలకు ఎంత విస్తృతమైన మౌలిక వ్యవస్థ పనిచేస్తోందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంతో పాటు పెరుగుతున్న సవాళ్లు
భారత్‌లో డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరుగుతున్న కొద్దీ, సైబర్ నేరాలను ఎదుర్కోవడం కూడా అంతే సవాలుగా మారుతోంది. 2025లో యూపిఐ ద్వారా 181 బిలియన్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో సుమారు 100 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితంతో పోలిస్తే, ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా చేసుకునే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది.
మీరు సైబర్ మోసానికి గురైతే... ఏం చేయాలి?
తాము సైబర్ మోసానికి గురయ్యామని తెలుసుకున్న క్షణం చాలా మందికి తీవ్ర ఆందోళన కలుగుతుంది. ఏం జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నంలో విలువైన సమయాన్ని వృథా చేస్తారు లేదా భయంతో అయోమయంలో పడిపోతారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని వెంటనే అర్థం అర్థంచేసుకోవడంకంటే, వేగంగా స్పందించడమే అత్యంత ముఖ్యం.
మీరు సైబర్ మోసానికి గురయ్యారని అనుమానిస్తే వెంటనే ఈ చర్యలు తీసుకోండి:
- 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయండి. www.cybercrime.gov.in లోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.
- మీ బ్యాంకును వెంటనే సంప్రదించి, అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయాలని లేదా సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయాలని కోరండి.
- ప్రమాదానికి గురి అయ్యే అవకాశమున్న అన్ని ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి. సాధ్యమైన చోట అదనపు భద్రతా ఫీచర్లను ప్రారంభించండి.
- స్క్రీన్ షాట్‌లు, లావాదేవీల వివరాలు, సందేశాలు, ఫోన్ నంబర్లు వంటి అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను భద్రపర్చండి. దర్యాప్తులో ఇవి కీలకంగా ఉపయోగపడతాయి.
- అవసరమైతే స్థానిక పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయండి.
సైబర్ మోసం జరిగిన తర్వాత తొలి కొన్ని గంటలు అత్యంత కీలకమైనవి. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. దీంతో మరిన్ని ఆర్థిక నష్టాలను నివారించే అవకాశాలు కూడా పెరుగుతాయి.
అవగాహనే అత్యంత బలమైన రక్షణ
సైబర్ నేరగాళ్లు తమ మోసాల రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటారు. అందుకే ప్రజల్లో అవగాహన కూడా అంతే వేగంతో పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి కొత్త మోసాన్ని గుర్తుంచుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. ఎవరైనా మీలో భయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా? వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారా? నిజానిజాలు తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే డబ్బు పంపమని అడుగుతున్నారా? నకిలీ పోలీసు అధికారైనా, క్లోన్ చేసిన గొంతైనా, లేదా అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశమైనా—ఈ ప్రశ్నలు ప్రతి సందర్భంలోనూ మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి.
ఇలాంటి అవగాహనను ప్రజల్లో పెంపొందించడంలో ఎయిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అమలుపరుస్తున్న బంధన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమమైన 'సైబర్ కాప్' కీలక పాత్ర పోషిస్తోంది. సురక్షితమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించడం, సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.
ప్రతి ఫోన్ కాల్‌ను, ప్రతి సందేశాన్ని అనుమానించమని చెప్పడం దీని ఉద్దేశం కాదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక చిన్న అలవాటును పెంపొందించుకోవాలని ఇది సూచిస్తోంది— ఆగండి, ధృవీకరించండి, ఫిర్యాదు చేయండి.
(ఒక్క క్షణం ఆగండి... నిజానిజాలు ధృవీకరించండి... అవసరమైతే ఫిర్యాదు చేయండి.)
ఎందుకంటే నేటి డిజిటల్ ప్రపంచంలో, ఆ ఒక్క క్షణం ఆలోచించి తీసుకునే నిర్ణయమే పెద్ద నష్టాన్ని నివారించగలదు.
పాఠకులకు గమనిక: ఈ కథనాన్ని బ్రాండ్ తరఫున హెచ్ టి బ్రాండ్ స్టూడియో (HT Brand Studio) రూపొందించింది. ఈ కథనం రూపకల్పన లేదా ప్రచురణలో HT Telugu సంపాదక బృందానికి ఎటువంటి పాత్ర లేదు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


