New world map : కొత్త వరల్డ్ మ్యాప్‌కి యూఎన్ ఆమోదం- పెద్దగా ఆఫ్రికా, చిన్నగా యూరోప్..
శతాబ్దాలుగా ప్రపంచ పటంలో భూభాగాల పరిమాణాన్ని తప్పుగా చూపుతున్నారన్న ఆఫ్రికా ఖండపు వాదనకు ఐక్యరాజ్యసమితి మద్దతు తెలిపింది. 'కరెక్ట్ ది మ్యాప్' పేరిట తీసుకొచ్చిన తీర్మానానికి ఐరాస సాధారణ సభ ఆమోదం తెలిపింది.
మనం చిన్నప్పటి నుంచి స్కూళ్లలో, పుస్తకాల్లో చూస్తున్న ప్రపంచ పటం (వరల్డ్ మ్యాప్) నిజమైన భూగోళ స్వరూపానికి ప్రతిరూపం కాదంటే నమ్ముతారా? అవును, శతాబ్దాలుగా మనం చూస్తున్న వరల్డ్ మ్యాప్‌లో ఆఫ్రికా ఖండం నిజమైన పరిమాణం కంటే చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఈ చారిత్రక పొరపాటును దిద్ది, ఖండాల విస్తీర్ణానికి తగినట్లుగా పటాలను రూపొందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) నేతృత్వంలో టోగో దేశం ప్రవేశపెట్టిన ‘కరెక్ట్ ది మ్యాప్’ తీర్మానానికి ఐరాస సాధారణ సభలో ఊహించని మద్దతు లభించింది. ఏకంగా 164 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, కేవలం ఒకే ఒక్క దేశం వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో భూగోళ పటాల తయారీలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
ఏంటీ మెర్కేటర్ మ్యాప్? అసలు వివాదం ఏంటి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న మ్యాప్‌ను 16వ శతాబ్దంలో (1569లో) 'గెరార్డస్ మెర్కేటర్' అనే నావిగేటర్ రూపొందించారు. ఆ కాలంలో సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు డైరక్షన్స్ సులువుగా తెలిసేలా ఈ 'మెర్కేటర్ ప్రొజెక్షన్'ను డిజైన్ చేశారు.
అయితే, గుండ్రంగా ఉండే భూమిని ఫ్లాట్ (సమతల) కాగితంపై గీసేటప్పుడు ధ్రువ ప్రాంతాలకు (పోల్స్) దగ్గరగా ఉండే భూభాగాలు చాలా పెద్దవిగా, భూమధ్యరేఖ (ఈక్వేటర్) వద్ద ఉండే ప్రాంతాలు చిన్నవిగా మారిపోయాయి. దీనివల్ల ఉత్తరార్థ గోళంలో ఉన్న యూరోప్, ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్ వంటి ప్రాంతాలు వాటి నిజమైన విస్తీర్ణం కంటే చాలా పెద్దవిగా కనిపిస్తుండగా.. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలు చిన్నవిగా మారిపోయాయి.
గ్రీన్‌లాండ్ కంటే ఆఫ్రికా 14 రెట్లు పెద్దది!
మనం వాడే మ్యాప్‌లలో గ్రీన్‌లాండ్ ద్వీపం, ఆఫ్రికా ఖండం దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. కానీ వాస్తవ భూభౌగోళిక విస్తీర్ణం చూస్తే ఆఫ్రికా ఖండం గ్రీన్‌లాండ్ కంటే ఏకంగా 14 రెట్లు పెద్దది! భారతదేశ వైశాల్యం కంటే ఆఫ్రికా ఖండం తొమ్మిది రెట్లు పెద్దగా ఉంటుంది.
"శతాబ్దాలుగా మెర్కేటర్ మ్యాప్ ప్రపంచ భౌగోళిక స్వరూపాన్ని తప్పుగా చూపిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని కుదించి చూపెడుతోంది. ఇది కేవలం సాంకేతిక పొరపాటు మాత్రమే కాదు, ప్రపంచం దృష్టిలో ఆఫ్రికా ప్రాధాన్యతను తగ్గించేలా ఉంది," అని ఆఫ్రికన్ యూనియన్ స్పష్టం చేసింది. సైంటిఫిక్ ఆధారాల ప్రకారం ఆఫ్రికా నిజమైన రూపాన్ని ప్రపంచానికి చూపించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
కొత్త మ్యాప్‌తో ఆఫ్రికా పెద్దగా, యూరోప్, అమెరికా ఖండాలు చిన్నగా మారుతాయి.
ఐరాస నిర్ణయంపై ఆఫ్రికన్ యూనియన్ హర్షం..
ఐరాస తీర్మానం ఆమోదం పొందడంపై ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ ఛైర్‌పర్సన్ మహమూద్ అలీ యూసుఫ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. టోగో దేశ అధ్యక్షుడు ఫారే ఎస్సోజిమ్నా జ్ఞాసింగ్‌బే కృషిని, ఆఫ్రికా దేశాల ఐక్యతను ఆయన కొనియాడారు. "ప్రపంచ పటంలో ఆఫ్రికా నిజమైన పరిమాణం, దానికి దక్కాల్సిన అసలైన స్థానం దక్కే దిశగా ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు," అని వ్యాఖ్యానించారు.
మార్పులకు పిలుపు..
ఐరాస మద్దతు లభించిన నేపథ్యంలో.. అంతర్జాతీయ సంస్థలు, పాఠశాలలు, ప్రచురణకర్తలు, డిజిటల్ మ్యాప్ ప్లాట్‌ఫారమ్‌లు (గూగుల్ మ్యాప్స్ వంటివి) తమ పటాలను మార్చాలని ఆఫ్రికన్ యూనియన్ కోరుతోంది. ఖండాల నిజమైన పరిమాణాన్ని ప్రతిబింబించే ‘ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్’ వంటి సరికొత్త సాంకేతిక పటాలను తరగతి గదుల్లో, మీడియాలో విస్తృతంగా ఉపయోగించాలని విజ్ఞప్తి చేసింది.
నావిగేషన్ అవసరాలకు మెర్కేటర్ మ్యాప్ ఉపయోగపడినప్పటికీ, విద్యాబోధన, భౌగోళిక అవగాహన కోసం సమాన విస్తీర్ణాన్ని తెలిపే మ్యాప్‌లనే వాడాలని ఐరాస తీర్మానం స్పష్టం చేస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


