స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) అంటే ఏమిటి? రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

రిటైల్ ఇన్వెస్టర్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చనే ఆశతో చాలామంది ఈ విభాగంలోకి అడుగుపెడుతున్నారు. ఇన్వెస్టర్లు పాటించాల్సిన జాగ్రత్తలపై కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అందించిన విశ్లేషణ చూద్దాం.

Published on: Aug 12, 2026, 15:52:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాక్ మార్కెట్‌లో సాధారణ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. F&O అనేది డెరివేటివ్స్ (Derivatives) విభాగానికి చెందింది. అంటే, ఈ కాంట్రాక్ట్‌లకు సొంతంగా విలువ ఉండదు; ఇవి ఒక మూల ఆస్తి (Underlying Asset - స్టాక్ లేదా ఇండెక్స్) విలువపై ఆధారపడి పనిచేస్తాయి.

కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

F&O అంటే ఏమిటి?

ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (Futures Contract): ముందుగా నిర్ణయించిన ధర, తేదీ నాటికి ఒక ఆస్తిని కొనడానికి (కొనుగోలుదారు) లేదా అమ్మడానికి (అమ్మకందారు) ఇరుపక్షాలను బాధ్యులను (Obligation) చేస్తుంది.

ఆప్షన్స్ కాంట్రాక్ట్ (Options Contract): నిర్దిష్ట ఎక్స్‌పైరీ తేదీకి ముందే, నిర్ణీత ధర వద్ద ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి కొనుగోలుదారుకు 'హక్కు' (Right) ఇస్తుంది, కానీ 'బాధ్యత' (Obligation) ఉండదు.

సాధారణంగా మార్కెట్ పాల్గొనేవారు రిస్క్ మేనేజ్‌మెంట్ (Hedding), స్పెక్యులేషన్ లేదా ఆర్బిట్రేజ్ కోసం ఈ కాంట్రాక్ట్‌లను ఉపయోగిస్తారు.

ఈక్విటీ ట్రేడింగ్‌కు, F&O కి ఉన్న తేడాలు

యాజమాన్యం (Ownership): ఈక్విటీ ట్రేడింగ్‌లో మీరు ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, వాటికి యజమానిగా దీర్ఘకాలం ఉంచుకోవచ్చు. కానీ F&O లో మీరు షేర్లను సొంతం చేసుకోరు, కేవలం వాటి విలువ ఆధారిత కాంట్రాక్ట్‌లను మాత్రమే ట్రేడ్ చేస్తారు.

పెట్టుబడి, మార్జిన్ (Capital & Margin): ఈక్విటీలో షేర్లు కొనడానికి పూర్తి సొమ్ము చెల్లించాలి. F&O లో 'మార్జిన్' ద్వారా తక్కువ మొత్తంతో పెద్ద పొజిషన్లను (Leverage) తీసుకోవచ్చు.

కాలపరిమితి (Expiry): ఈక్విటీ షేర్లకు ఎలాంటి కాలపరిమితి ఉండదు. కానీ F&O కాంట్రాక్ట్‌లకు నిర్దిష్ట ఎక్స్‌పైరీ (వారపు లేదా నెలావారీ) తేదీలు ఉంటాయి.

రిటైల్ ఇన్వెస్టర్లు F&O లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

ప్రొఫెషనల్ ట్రేడర్లు రిస్క్ తగ్గించుకోవడానికి F&O వాడితే, రిటైల్ ఇన్వెస్టర్లు వేగంగా లాభాలు ఆర్జించే క్రమంలో నష్టాల ముప్పును అంచనా వేయలేకపోతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరికతో ఉండటానికి ప్రధాన కారణాలు:

1. హై లివరేజ్ - పెరిగే నష్టాలు: తక్కువ మార్జిన్ చెల్లించి పెద్ద పొజిషన్లు తీసుకోవడం వల్ల మార్కెట్ అనుకూలిస్తే ఎంత ఎక్కువ లాభం వస్తుందో, వ్యతిరేకిస్తే మీ అసలు పెట్టుబడి కంటే ఎక్కువ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.

2. పరిమిత కాలపరిమితి (Time Decay): కాంట్రాక్ట్‌లకు ఎక్స్‌పైరీ తేదీలు ఉంటాయి. మీ అంచనా సరైనదే అయినా, నిర్ణీత సమయంలోగా మార్కెట్ ఆ దిశగా కదలకపోతే మీ పొజిషన్ విలువ సున్నా కావచ్చు.

3. మార్కెట్ టైమింగ్ కీలకం: ఈక్విటీల్లో దీర్ఘకాలం నిరీక్షించే వెసులుబాటు ఉంటుంది. కానీ F&O లో ఎంట్రీ, ఎగ్జిట్ సమయం సరిగ్గా లేకపోతే స్వల్ప వ్యవధిలోనే భారీ నష్టం వస్తుంది.

4. విజయం సాధించే సంభావ్యత తక్కువ: సెబీ (SEBI) 2023 నివేదిక ప్రకారం, F&O విభాగంలో ట్రేడింగ్ చేసే ప్రతి 10 మంది రిటైల్ ట్రేడర్లలో 9 మంది (90%) నష్టాలనే చవిచూస్తున్నారు.

5. మానసిక ఒత్తిడి: F&O లో వేగంగా మారే ధరల వల్ల ట్రేడర్లు తీవ్ర ఒత్తిడికి గురై కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ.

బాధ్యతాయుతమైన F&O ట్రేడింగ్ కోసం పాటించాల్సిన సూత్రాలు

F&O ట్రేడింగ్‌లో అత్యంత కీలకమైన గోల్డెన్ రూల్ ఏమిటంటే.. ఆ ప్రొడక్ట్ గురించి పూర్తి అవగాహన లేకుండా, అలాగే మీరు కోల్పోయినా భరించగలిగే సొమ్ముతో తప్ప, F&O ట్రేడింగ్‌లోకి ఎప్పుడూ దిగకూడదు.

సమగ్ర అవగాహన పెంచుకోండి: F&O ట్రేడింగ్ సూత్రాలు, గ్రీక్స్ (Greeks), మార్జిన్ సిస్టమ్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేయండి.

రిస్క్ పరిమితులు (Risk Limits): ప్రతి ట్రేడ్‌కు ఎంత నష్టం భరించగలరో ముందే సరిహద్దులు గీసుకోండి.

స్టాప్-లాస్ (Stop-Loss) తప్పనిసరి: ప్రతి F&O పొజిషన్‌కు క్రమం తప్పకుండా స్టాప్-లాస్ ఆర్డర్‌లను ఉపయోగించండి.

తక్కువ పోర్ట్‌ఫోలియో కేటాయింపు: మీ మొత్తం పెట్టుబడిలో చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే F&O కి కేటాయించండి.

ప్రారంభకులకు సూచన: కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారు ముందుగా వర్చువల్/డెమో ట్రేడింగ్ చేయడం లేదా ఈక్విటీ మార్కెట్లలో అనుభవం గడించడం శ్రేయస్కరం.

వ్యాసకర్త:

శ్రీకాంత్ చౌహాన్,

హెడ్ - ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More