US snow storm : అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను- 17 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. మిలియన్ల మందిపై ప్రభావం!

అమెరికాలో రికార్డు స్థాయి మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సుమారు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలిలో చిక్కుకుపోయారు. 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించగా, 6000కు పైగా విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి.

Published on: Jan 24, 2026, 06:45:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాను భయంకరమైన శీతాకాల తుపాను వణికిస్తోంది. సుమారు 150 మిలియన్ల మంది (15 కోట్ల మంది) అమెరికన్లు ప్రస్తుతం వాతావరణ అత్యవసర స్థితిని ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నార్త్ వెస్ట్ టెక్సాస్, ఓక్లహోమా సిటీలలో భారీ హిమపాతంతో మొదలైన ఈ యూఎస్​ వింటర్​ స్నో స్టార్మ్​.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గడ్డకట్టే చలి, మంచు వర్షం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఇప్పటివరకు కనీసం 17 రాష్ట్రాలు 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ' ప్రకటించాయి.

అమెరికాలో మంచు తుపాను
అమెరికాలో మంచు తుపాను

యూఎస్​ మంచు తుపాను- ప్రమాదకరంగా మారిన వాతావరణం..

ఓక్లహోమా నుంచి ఈశాన్య ప్రాంతం వరకు భారీగా మంచు కురుస్తుందని, కొన్ని చోట్ల అడుగు కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్​డబ్ల్యూఎస్​) హెచ్చరించింది.

"దక్షిణ మైదానాలు, మిసిసిపి వ్యాలీ, ఆగ్నేయ ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు చాలా కాలం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చు. ప్రయాణాలు చేయడం అత్యంత ప్రమాదకరం," అని ఎన్​డబ్ల్యూఎస్​ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర ఈ తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గడ్డకట్టే గాలి ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోనుంది.

తీవ్రమైన మంచు ప్రభావంతో అలబామా, అర్కాన్సాస్, జార్జియా, కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మేరీల్యాండ్, మిసిసిపి, మిస్సౌరీ, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టేనస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా అత్యవసర స్థితి అమల్లో ఉంది.

విమానాల రద్దు.. స్తంభించిన ప్రయాణాలు..

అమెరికా మంచు తుపాను ప్రభావం విమానయానంపై తీవ్రంగా పడింది. ఇప్పటికే వారాంతంలో జరగాల్సిన 6000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఒక్కరోజే 2,800కిపైగా విమాన సేవలు నిలిచిపోయాయి. ఇక ఆదివారం కార్యకలాపాల్లో ఈ సంఖ్య 3,5000 దాటిపోయింది.

తాజా విపత్తు పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని డెల్టా ఎయిర్ లైన్స్ విజ్ఞప్తి చేసింది. వాతావరణం మరింత క్షీణిస్తే అనేక విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి ఉంటుందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​ఏఏ) పేర్కొంది.

యూఎస్​ మంచు తుపాను- న్యూయార్క్ వాసులకు హెచ్చరిక..

"న్యూయార్క్‌లో చలికాలం మనకు కొత్తేమీ కాదు, కానీ తీవ్రమైన చలి వల్ల వచ్చే ప్రమాదాలను తక్కువగా అంచనా వేయకూడదు. మంచు కురుస్తున్న సమయంలో ప్రయాణాలు మానుకోండి," అని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ప్రజలను కోరారు.

న్యూయార్క్ నగరంలో ఆదివారం నుంచి సోమవారం వరకు భారీ హిమపాతం ఉంటుందని, రోడ్లన్నీ మంచుతో నిండిపోయి ప్రయాణాలు కష్టతరమవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, దీనివల్ల రోడ్లపై పేరుకుపోయిన మంచు త్వరగా కరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ తుపాను మరికొన్ని రోజుల పాటు అమెరికాను గడగడలాడించేలా కనిపిస్తోంది. ప్రజలు స్థానిక హెచ్చరికల తెలుసుకుని అప్రమత్తంగా ఉండటం ఉత్తమం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More