వస్తాడు.. సెంచరీ కొడతాడు.. రిపీటు! ఆసియ కప్​లోనూ వైభవ్​ సూర్యవంశీ హవా..

వైభవ్​ సూర్యవంశీ మరో సెంచరీ బాదేశాడు! అండర్​ 19 ఆసియా కప్​లో యూఏఈపై విజృంభించాడు. కేవలం 56 బంతుల్లో శతకం కొట్టేశాడు. చివరికి 95 బాల్స్​లోనే 171 చేసి ఔట్​ అయ్యాడు. ఇందులో 14 సిక్స్​లు ఉండటం విశేషం.

Published on: Dec 12, 2025 12:32 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా నెల రోజుల ముందు.. టీమిండియా యంగ్​ గన్​ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సత్తా చాటాడు! దుబాయ్​లో జరుగుతున్న అండర్​ 19 ఆసియా కప్​లో శుక్రవారం యూఏఈతో మ్యాచ్​లో ఈ 14ఏళ్ల యువ బ్యాటర్​ కేవలం 56 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫలితంగా టోర్నీ ఏదైనా, మ్యాచ్​ ఏదైన, పిచ్​ ఏదైనా బౌలర్లకు ఒక పీడకలగా నిలుస్తున్నాడు వైభవ్​.

సెంచరీ అనంతరం చేతులు జోడించిన వైభవ్​.. (Screengrab)
సెంచరీ అనంతరం చేతులు జోడించిన వైభవ్​.. (Screengrab)

అండర్​ 19 ఆసియా కప్​- వైభవ్​ సూర్యవంశీ సెంచరీ..

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కి దిగిన టీమిండియాకు మొదటిలోనే షాక్​ తగిలింది! కెప్టెన్​ ఆయుష్​ మత్రే 4 పరుగులకే ఔట్​ అయ్యాడు. కానీ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ హాఫ్​ సెంచరీ కొట్టాడు. అయితే 86 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను ఇచ్చిన క్యాచ్​ని లాంగ్​ ఆన్​లో ఫీల్డర్​ వదిలేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైభవ్​.. 56 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరో 39 బంతులాడి మొత్తం మీద 171 రన్స్​ చేసి ఔట్​ అయ్యాడు. ఇందులో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం.

38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్లు​ కోల్పోయి 294 పరుగులు చేసింది. ఇందులో 171 రన్స్​ వైభవ్​వే!

కొన్ని రోజుల క్రితమే సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీ చేసి, అండర్​-19లో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లేటెస్ట్​ మ్యాచ్​లో తన రికార్డును తానే బ్రేక్​ చేసుకునేలా కనిపించాడు, కానీ అది జస్ట్​లో మిస్స్​ అయ్యింది.

సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌ను రెండో ఓవర్‌లో కొట్టిన బౌండరీతో ప్రారంభించాడు. అక్కడి నుంచి, అతడు అద్భుతంగా ఆడాడు. తన భాగస్వామి ఆరోన్ జార్జ్ బౌండరీలు కొడుతున్నప్పటికీ, ఇతడు మాత్రం తొందరపడకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ క్రీజులో పాతుకుపోయాడు. అయితే, క్రీజులో కుదురుకున్న తర్వాత మాత్రం తుపానులా దూసుకెళ్లాడు. సూర్యవంశీ తనదైన శైలిలో గేర్లు మార్చి, ఒకే ఓవర్‌లో బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలనం..

సూర్యవంశీతో పాటు కెప్టెన్ ఆయుష్ మత్రే మంచి ఫాన్​లో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి గత నెలలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిపోయారు. మత్రే గ్రూప్ లీగ్ దశల్లో వరుసగా రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సూర్యవంశీ అయితే, మహారాష్ట్రపై శతకం బాది ఎస్‌ఎంఏటీ చరిత్రలోనే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు!

భారత జట్టులోని 15 మంది సభ్యుల్లో, ఈ ఇద్దరు యువకులు మూడు ఫార్మాట్లలో కలిసి 30కి పైగా సీనియర్ స్థాయి మ్యాచ్‌లు ఆడారు. అంతేకాకుండా, ఇద్దరూ కలిపి తొమ్మిది సెంచరీలు సాధించారు. మిగతా ఏడు జట్ల మొత్తం సెంచరీలను కలిపినా కూడా దీనికంటే తక్కువే! ఈ గణాంకాలే జూనియర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను తిరుగులేని ఫేవరెట్‌గా మారుస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More