ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిన రోహిత్​- కోహ్లీ.. ఫ్యాన్స్​కి తీవ్ర నిరాశ!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో రోహిత్​ శర్మ- విరాట్​ కోహ్లీలు పేలవ ప్రదర్శన చేశారు. ఫలితంగా వీరి కోసమే మ్యాచ్​ చూస్తున్న వారికి తీవ్ర నిరాశ ఎదురైంది.

Published on: Oct 19, 2025, 10:17:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా రోజుల తర్వాత క్రికెట్​ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ప్రముఖ ఆటగాళ్లు రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ.. ఫ్యాన్స్​ని తీవ్రంగా నిరాశపరిచారు. పెర్త్​ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో ఇద్దరు వెంట వెంటనే ఔట్​ అయ్యారు. రోహిత్​ 8 పరుగలే చేయగా, విరాట్​ కోహ్లీ డకౌట్​ రూపంలో వెనుదిరిగాడు!

విరాట్​ కోహ్లీ- రోహిత్​ శర్మ..
విరాట్​ కోహ్లీ- రోహిత్​ శర్మ..

టాప్​ ఆర్డర్​ విఫలం అవ్వడంతో, టాస్​ ఓడి మొదటి బ్యాటింగ్​కు దిగిన భారత్​ జట్టు కష్టాల్లో పడింది. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

రోహిత్​ శర్మ అలా- విరాట్​ కోహ్లీ ఇలా..

కెప్టెన్సీ నుంచి వైదొలగిన తరువాత స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తొలిసారి తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ, కేవలం సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. అనుభవజ్ఞుడైన ఓపెనర్ అయినప్పటికీ, ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. చివరికి హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ తరఫున తన మొదటి మ్యాచ్ ఆడుతున్న రోహిత్.. క్రీజులో కేవలం 14 బంతులు మాత్రమే నిలబడగలిగాడు! నాలుగో ఓవర్‌ నాలుగో బంతిని హేజిల్‌వుడ్ ఐదో స్టంప్ ఛానెల్‌లో పర్ఫెక్ట్‌గా వేశాడు. దాన్ని కవర్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన రోహిత్.. బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్‌లోని మ్యాట్ రెన్షాకు సులభ క్యాచ్ ఇచ్చాడు.

కాగా.. 39 ఏళ్ల రోహిత్ శర్మకు ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం! టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న రోహిత్ ఇప్పుడు పూర్తిగా వన్డేల పైనే దృష్టి పెట్టాడు. తాజా మైలురాయిని చేరుకున్న ఐదొవ భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనత సాధించారు.

మరోవైపు, ఈ మ్యాచ్​కి ముందు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (11,221 పరుగులు)ని అధిగమించి మూడో స్థానానికి చేరుకోవడానికి రోహిత్‌కు కేవలం 54 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ ఈ మ్యాచ్​లో ఆ ఫీట్​ సాధించలేకపోయాడు.

మరోవైపు, భారత జట్టుకు మరో కీలక ఆటగాడైన విరాట్ కోహ్లీకి కూడా ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్​ కలిసిరాలేదు! విరాట్​ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. క్రీజులో ఎనిమిది బంతులు మాత్రమే కోహ్లీ నిలబడి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు.

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత కోహ్లీ ఆడిన మొట్టమొదటి పోటీ మ్యాచ్ ఇది! నాలుగో ఓవర్‌లో రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతుండటంతో కాస్త తడబడుతున్నట్లు కనిపించాడు.

అయితే ఏడో ఓవర్‌ తొలి బంతికే కోహ్లీ వికెట్ మిచెల్ స్టార్క్ పడగొట్టాడు. ఈ అనుభవజ్ఞుడైన ఆటగాడు ఆస్ట్రేలియా గడ్డపై వన్డేలలో డకౌట్ అవ్వడం తన కెరీర్‌లో ఇదే మొదటిసారి! ఆస్ట్రేలియాలో ఆడిన 30 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి.

ఈ వికెట్‌తో, జేమ్స్ అండర్సన్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లన్నింటిలోనూ కోహ్లీని రెండుసార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.

కాగా శుభ్​మాన్​ గిల్​ సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఓపనింగ్​కి వచ్చి 10 పరుగులే చేశాడు. టాప్​ ఆర్డర్​ విఫలం అయిన తర్వాత ప్రస్తుతం శ్రేయస్​ అయ్యర్​, అక్సర్​ పటేల్​లు క్రీజ్​లో ఉన్నారు.

వర్షం కారణంగా 49 ఓవర్లకు తగ్గిన మొదటి వన్డేలో భారత్​ ప్రస్తుతం 37-3 (12 ఓవర్లకు) వద్ద ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More