Delhi AQI : ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాలు.. టాప్ 100లో 93 ఇండియాలోనే!
దీపావళి వేడుకల అనంతరం దేశవ్యాప్తంగా గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం ఉన్న 100 సిటీల జాబితాలో ఏకంగా 93 భారతీయ నగరాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి..

దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు దేశ ప్రజలను వాయు కాలుష్య భయం వెంటాడుతోంది. నవంబర్ 8న జరిగిన వేడుకల అనంతరం దేశవ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది! నవంబర్ 9 ఉదయం 10:05 గంటలకు 'AQI.in' విడుదల చేసిన అంతర్జాతీయ కాలుష్య నగరాల నివేదిక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భారం ఎదుర్కొంటున్న 100 నగరాల జాబితాలో ఏకంగా 93 నగరాలు భారతదేశంలోనే ఉండటం పర్యావరణ అత్యవసర పరిస్థితిని చాటిచెబుతోంది!
సాధారణంగా చలికాలంలో దిల్లీ, ఉత్తరాది నగరాలకే పరిమితమవుతుందని భావించే ఈ విషపూరిత పొగమంచు ఇప్పుడిప్పుడే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
అంతర్జాతీయ నివేదిక ప్రకారం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ 868 ఏక్యూఐ నమోదు చేసి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన గాలి ఉన్న నగరంగా మొదటి స్థానంలో నిలిచింది! ఈ రీడింగ్‌ను అత్యంత ప్రమాదకరమైన కేటగిరీగా వర్గీకరించారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ 842 ఏక్యూఐతో రెండో స్థానంలో నిలవగా, భటిండా 797 ఏక్యూఐతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

జాబితాలోని మొదటి 10 నగరాల్లో హరియాణాకు చెందిన సిర్సా 612 ఏక్యూఐతో నాలుగో స్థానంలో, భివానీ 548 ఏక్యూఐతో ఐదో స్థానంలో నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుదౌన్ 489, హిసార్ 485, అమృతసర్ 451 ఏక్యూఐలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ 446 ఏక్యూఐతో 9వ స్థానంలో నిలవగా, ప్రయాగ్‌రాజ్ 440 రీడింగ్‌తో పదో స్థానంలో ముగిసింది. దేశ రాజధాని దిల్లీ 380 ఏక్యూఐ నమోదు చేసి అంతర్జాతీయంగా 15వ స్థానంలో నిలిచింది. అయితే ఈ రీడింగ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లక్నో 344 ఏక్యూఐతో 20వ స్థానంలో, కాన్పూర్ 337తో 22వ స్థానంలో నిలిచాయి. ఘాజియాబాద్ (331), గ్రేటర్ నోయిడా (327), నోయిడా (307) నగరాలు కూడా ప్రమాదకర కేటగిరీలోనే కొనసాగుతున్నాయి.

ఈ కాలుష్య తీవ్రత కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదని నివేదిక స్పష్టం చేస్తోంది. పశ్చిమ, మధ్య, తూర్పు భారత నగరాల్లోనూ వాయు నాణ్యత క్షీణించింది. పూణెలో 278, భోపాల్‌లో 284, పట్నాలో 258 ఏక్యూఐ నమోదయ్యాయి. వారణాసి (243), రాజ్‌కోట్ (242), నాసిక్ (219), భువనేశ్వర్ (200), దుర్గాపూర్ (197), హౌరా (187), కోల్‌కతా (183) నగరాలు కూడా కాలుష్య రహితంగా లేవు.
(PTI)
ప్రపంచవ్యాప్తంగా వంద నగరాల జాబితాలో భారత్ బయట కేవలం 6 నగరాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. వాటిలో పాకిస్థాన్‌కు చెందిన లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్‌లతో పాటు బ్రిటన్‌లోని కిడ్‌బ్రూక్, క్యాట్‌ఫోర్డ్, పోలాండ్‌లోని మియెలెక్, ఇండోనేషియాలోని సంపిట్ నగరాలు ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం దీపావళి సంబరాల వల్లే సంభవించాయని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, భారతదేశంలో వాయు కాలుష్య పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో ఈ నివేదిక కళ్లకు కడుతోంది.
(PTI)
E-Paper

