Egg nutrition myths : రోజూ గుడ్డు తింటే గుండెపోటు వస్తుందా? అసలు నిజాలు..
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెజబ్బులు వస్తాయనేది దశాబ్దాల నాటి అపోహ మాత్రమేనని నిపుణులు తేల్చిచెప్పారు. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, శరీరంలో జరిగే అద్భుత మార్పులపై హైదరాబాద్ అపోలో వైద్యుడితో పాటు అంతర్జాతీయ నిపుణులు వెల్లడించిన నిజాలు ఇవే..
ఉదయాన్నే టిఫిన్‌లో ఉడకబెట్టిన గుడ్డు తినాలా వద్దా? పచ్చసొన (Egg Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వస్తుందా? - దశాబ్దాలుగా ప్రతీ భారతీయ కుటుంబంలో నలుగుతున్న అతిపెద్ద సందేహం ఇది. గుడ్డును ఒకప్పుడు సంపూర్ణ పోషకాహారంగా పొగిడిన వారే, ఆ తర్వాత దాని పచ్చసొన రక్తనాళాలను పూడ్చేస్తుందంటూ భయపెట్టారు. ఈ భయంతోనే చాలామంది పచ్చసొనను పక్కనపడేసి కేవలం తెల్లసొన మాత్రమే తింటున్నారు. అయితే, ఈ భయాలన్నీ కేవలం అపోహలేనని, గుడ్డును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ విషయంపై శాస్త్రీయ ఆధారాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో ఏకంగా 28 ఏళ్ల పాటు సాగిన ఒక భారీ అధ్యయనం వివరాలను ఆయన బయటపెట్టారు. "ఆహారంలో గుడ్లు ఎక్కువగా తీసుకునే వారిలో 'ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్' (IHD) లేదా గుండెపోటు వచ్చే అవకాశాలు, దానివల్ల సంభవించే మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది," అని డాక్టర్ సుధీర్ కుమార్ వివరించారు. సాధారణ భాషలో చెప్పాలంటే.. క్రమం తప్పకుండా గుడ్లు తినే వారిలో గుండెపోటు ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన నిరూపించింది.
అసలు గుడ్డు పచ్చసొనపై ఈ స్థాయిలో భయాలు ఎందుకు వ్యాపించాయి? మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోకి చేరి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తుందనే పాత భావనే దీనికి కారణం. అయితే, ఆధునిక వైద్య విజ్ఞానం ఈ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది.
"ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్‌కి, మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌కి నేరుగా సంబంధం ఉండదు. మనం తినే గుడ్డు వల్ల రక్తంలో హానికరమైన ఎల్డీఎల్ (LDL) కొలెస్ట్రాల్ పరిమాణం ఏమాత్రం పెరగదు," అని డాక్టర్ సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్, లూటీన్, జియాజాంతిన్తో పాటు శరీరానికి త్వరగా అబ్బే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజూ ఒక గుడ్డు నిరభ్యంతరంగా తినవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రసిద్ధ ఎయిమ్స్ (AIIMS), హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొంది, ప్రస్తుతం కాలిఫోర్నియాలో పనిచేస్తున్న ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ కూడా గుడ్డు మహత్యాన్ని వివరించారు. "గుడ్డులో ఉండే 'కోలిన్' (Choline) అనే పోషకం మెదడులో 'ఎసిటైల్ కోలిన్' అనే రసాయన ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది," అని డాక్టర్ సౌరభ్ సేథీ తెలిపారు. గుడ్డు తినడం వల్ల శరీరంలో హెచ్‌డీఎల్ (HDL) అంటే 'మంచి కొలెస్ట్రాల్' పరిమాణం పెరుగుతుందని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా గుడ్డు పచ్చసొనలోని లూటీన్, జియాజాంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు మన కళ్లను హానికరమైన స్క్రీన్ బ్లూ లైట్ నుంచి రక్షిస్తాయి. గుడ్డులోని సల్ఫర్ అమైనో యాసిడ్లు జుట్టు, చర్మం, గోళ్లకు అవసరమైన 'కెరాటిన్' ప్రొటీన్‌ను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ మీరు శాకాహారులైతే, టోఫు, సోయా పదార్థాలు తినడం ద్వారా కూడా ఈ తరహా ప్రొటీన్లను పొందవచ్చని ఆయన సూచించారు.
E-Paper

