మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలా? మానసిక నిపుణుడు చెప్పిన 5 గోల్డెన్ రూల్స్..
జీవితంలో నిజమైన స్నేహితులను గుర్తించడం, వారితో బంధాన్ని బలపరుచుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మన మనస్సుకు తగిన వారిని ఎలా ఎంచుకోవచ్చో, ఎలాంటి వారితో స్నేహం మన ఎదుగుదలకు తోడ్పడుతుందో అమెరికాకు చెందిన ప్రముఖ థెరపిస్ట్ వివరించిన 5 ముఖ్యాంశాలు మీకోసం..
సామాజిక జీవి అయిన మనిషికి స్నేహం అనేది ఒక వరం. ఉద్యోగం, వ్యాపారాల్లో రాణించాలన్నా, వ్యక్తిగత జీవితంలో మానసిక ప్రశాంతత పొందాలన్నా మంచి మిత్రుల అండ తప్పనిసరి. అయితే కొత్తవారితో మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా కొందరిలో ఒకరకమైన భయం, సందిగ్ధత నెలకొంటాయి. "నాతో ఎవరైనా సరిగ్గా ఉంటారా? నన్ను అర్థం చేసుకుంటారా?" అనే సందేహాలు వారిని వెంటాడుతుంటాయి. మన మనస్తత్వానికి సరిపోయే, మనల్ని అర్థం చేసుకునే మంచి మనుషులను ఎలా గుర్తించాలి? ఈ అంశంపై అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ థెరపిస్ట్ జెఫ్రీ మెల్ట్జర్ సోషల్ మీడియా వేదికగా కొన్ని విలువైన సూచనలు చేశారు. మన జీవితంలో ప్రాణస్నేహితులుగా మారే వారిలో ఉండాల్సిన 5 ముఖ్యమైన లక్షణాలను ఆయన స్పష్టంగా వివరించారు.
భావోద్వేగాలకు విలువ ఇవ్వాలి- మన భావోద్వేగాలను గౌరవించడం అంటే మనం చెప్పే ప్రతి దానికి ఎదుటివారు "అవును" అని తల ఊపడం కాదు. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు మన భావాలను చులకన చేయకుండా, తక్షణమే సలహాలు ఇచ్చి సరిదిద్దడానికి ప్రయత్నించకుండా.. ముందు మన బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారే నిజమైన స్నేహితులు. "ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తుల దగ్గర మన మనసులోని నిజమైన భావాలను, బాధలను భయం లేకుండా స్వేచ్ఛగా పంచుకోగలుగుతాం. అక్కడ మనకు ఒక రకమైన సురక్షిత భావన కలుగుతుంది," అని జెఫ్రీ పేర్కొన్నారు.
సానుకూల దృక్పథంతో సవాలు చేయాలి- మంచి బంధం లేదా స్నేహం అనేది మిమ్మల్ని ఎప్పుడూ ఒకే చోట ఆపి ఉంచకూడదు. మీ పరిమితులను దాటి ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలి. "సరైన స్నేహితులు మీరు సాధించాలనుకునే లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తారు. మీ కాంఫర్ట్ జోన్ (సౌకర్యవంతమైన సరిహద్దులు) దాటి బయటకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. అలాంటి వారి సహచర్యం వల్ల మీరు అనుకున్న వ్యక్తిగా ఎదగడం మరింత తేలికవుతుంది," అని థెరపిస్ట్ వివరించారు.
విజయాలను మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి- జీవితంలో మనం ఏదైనా మంచి వార్తను లేదా విజయాన్ని పంచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి స్పందించే తీరును బట్టి ఆ బంధం ఎలాంటిదో సులువుగా చెప్పవచ్చు. "మీకు ఏదో కష్టం వచ్చినప్పుడు మాత్రమే అందుబాటులో ఉండటం కాదు.. మీ జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు, వారు తమ స్వార్థాన్ని పక్కన పెట్టి మీ విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందిస్తారు. అలాంటి వారే మీ నిజమైన స్నేహితులు," అని జెఫ్రీ స్పష్టం చేశారు. మన సంతోషాన్ని చూసి ఈర్ష్య పడని వారితో బంధం ఎల్లప్పుడూ బలంగా ఉంటుందన్నారు.
పరస్పర స్పందన- ఆరోగ్యకరమైన స్నేహంలో లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ, బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత కేవలం ఒక్కరిపైనే ఆధారపడకూడదు. "ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించడానికి, ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడానికి సమానంగా ప్రయత్నించాలి. కాలక్రమేణా ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం ఇద్దరికీ ముఖ్యమే అనే భావన స్పష్టంగా కనిపించాలి," అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే వైపు నుంచి మాత్రమే ప్రయత్నాలు ఉంటే అది ఎక్కువ కాలం నిలవదన్నారు.
మీకు ప్రాధాన్యత ఇవ్వాలి- మన ఉనికికి విలువ ఇచ్చే వ్యక్తుల చుట్టూ మనం ఉండాలి. నిజమైన మిత్రులు మీ జీవితం పట్ల ఆసక్తి చూపుతారు. మీరు వారితో పంచుకున్న విషయాలను, జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటారు. "వారితో కలిసి ఉన్నప్పుడు 'వీరికి నిజంగా నేను అవసరమా లేదా?' అని మీరు పదే పదే ఆలోచించాల్సిన పని ఉండదు. మాటల్లోనూ, చేతల్లోనూ మీరు వారికి ముఖ్యమైన వారే అనే భావనను వారు కలిగిస్తారు," అని జెఫ్రీ తెలిపారు.
E-Paper

