Bathukamma Celebration Pics : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో
Bathukamma Celebration Pics : తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ - రష్మిక దంపతులు బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, పూల అందాల విశిష్టతకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.

పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి వీధి, ప్రతి కూడలి రంగురంగుల ప్రకృతి పూలతో, మహిళల ఉత్సాహపూరిత ఆటపాటలతో హోరెత్తింది.

ఆదివారం ఉదయం నుంచే ఇళ్లలో గునుగు, తంగేడు, చామంతి, గులాబీ, కట్ల వంటి వైవిధ్యమైన పూలతో బతుకమ్మలను ఆకర్షణీయంగా పేర్చారు. సాయంత్రం వేళకు మహిళలు, యువతులు, చిన్నారులు సాంప్రదాయ పట్టువస్త్రాలు ధరించి బతుకమ్మలను స్థానిక ఆలయ ప్రాంగణాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి చుట్టూ తిరుగుతూ జానపద పాటలతో అలరించారు.

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.." "రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.." అంటూ మహిళలు ఆడిపాడారు.

సాంప్రదాయ పాటలు, కోలాటాల చప్పుళ్లు తెలంగాణ నలుమూలలా మారుమోగాయి. వేడుకల అనంతరం శోభాయాత్రగా తరలివెళ్లి సమీపంలోని చెరువులు, వాగులు, కాలువలలో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో సాగనంపారు.

ఒకరికొకరు సద్దుల వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకను నిర్వహించింది.

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్‌బండ్ వద్ద భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి.

ట్యాంక్ బండ్ మీద మహా బతుకమ్మ ర్యాలీలో వందలాది మంది జానపద కళాకారులు, మహిళలు పాల్గొన్నారు. లేజర్ షోలు, బాణసంచా కనువిందు మధ్య ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా సాగింది.

ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో పాటు ఈ సంబరాల్లో పాల్గొన్న ఈ నూతన దంపతులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో భాగమయ్యారు.

విజయ్, రష్మిక రాకతో హుస్సేన్ సాగర్ తీరాన అభిమానుల, సందర్శకుల ఉత్సాహం రెట్టింపైంది. తెలంగాణ అస్తిత్వానికి, ప్రకృతి ప్రేరణకు అద్దం పట్టే పూల పండుగ సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ఎంతో ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.

E-Paper

