Maruti Suzuki Dzire : షాకిచ్చిన మారుతీ సుజుకీ- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారు 'డిజైర్' ధర పెంపు! ఎంతంటే..
భారతదేశంలో 2025 సంవత్సరానికి గానూ అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించిన ‘మారుతీ సుజుకీ డిజైర్’ ధరలను కంపెనీ పెంచింది. ఈ నేపథ్యంలో డిజైర్ వేరియంట్లు, వాటి పాత- కొత్త ధరల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్‌కాంపాక్ట్ సెడాన్ కారు ‘మారుతీ సుజుకీ డిజైర్’ కొనుగోలు చేయాలనుకునే వారికి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ షాక్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్ అయిన డిజైర్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా రూ. 7,500 వరకు ఉంది.
గతేడాది (2025లో) దేశవ్యాప్తంగా సుమారు 2.14 లక్షల యూనిట్ల విక్రయాలతో తన తోటి మోడళ్లయిన బ్రెజ్జా, స్విఫ్ట్‌లను వెనక్కి నెట్టి.. ‘ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ కార్’గా డిజైర్ నిలిచింది. అంతటి క్రేజ్ ఉన్న ఈ కారు ధరలు ఇప్పుడు పెరిగాయి. అయితే, ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. ఈ కారు బేస్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) ధరలో కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు. అది మునుపటి లాగే రూ. 6.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతోనే లభిస్తుంది. మిగిలిన అన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి.
సీఎన్‌జీ (CNG) వేరియంట్లు: మారుతీ సుజుకీ డిజైర్‌లో అత్యధికంగా సీఎన్జీ మోడళ్లపైనే రూ. 7,500 వరకు భారీగా ధర పెరిగింది. వీఎక్స్ఐ సీఎన్జీ మోడల్ గతంలో ధర రూ. 8.03 లక్షలుగా ఉండగా, తాజా పెంపు తర్వాత రూ. 8.10 లక్షలకు చేరింది. ఇక జెడ్ఎక్స్ఐ సీఎన్జీ ధర గతంలో రూ. 9.03 లక్షలు కాగా, ఇప్పుడు రూ. 9.11 లక్షలకు పెరిగింది.
పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు: మిడ్- టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్లపై రూ. 5,000 చొప్పున ధరలు పెరిగాయి. వీఎక్స్ఐ ఎంటీ, ఏఎంటీ ధరలు గతంలో వరుసగా రూ. 7.17 లక్షలు, రూ. 7.62 లక్షలుగా ఉండేవి. ధరల పెంపు తర్వాత వీఎక్స్ఐ ఎంటీ ధర రూ. 7.22 లక్షలకు, వీఎక్స్ఐ ఏఎంటీ ధర రూ. 7.67 లక్షలకు చేరింది. ఇక జెడ్ఎక్స్ఐ ఎంటీ, ఏఎంటీ మునుపు ధరలు వరుసగా రూ. 8.17 లక్షలు, రూ. 8.62 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు ఇవి రూ. 8.22 లక్షలు, రూ. 8.67 లక్షల ధరల్లో లభిస్తాయి. మరోవైపు జెడ్ఎక్స్ఐ+ ఎంటీ, ఏఎంటీ ధరలు ఇప్పుడు రూ. 8.91 లక్షలు, రూ. 9.36 లక్షలకు పెరిగాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
మారుతీ సుజుకీ డిజైర్ కారులో సరికొత్త 'Z12E' సిరీస్ 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 80.46 బీహెచ్పీ పవర్‌ని, 111.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. ఇక ఇదే ఇంజన్‌తో వచ్చే సీఎన్జీ మోడల్ కాస్త తక్కువ పవర్‌ను అందిస్తుంది. ఇది 68.79 బీహెచ్పీ పవర్‌ని, 101.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్లను మారుతీ సుజుకీ మైలేజ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసింది. దీని పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.79 కిమీ మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ వేరియంట్ కేజీకి ఏకంగా 33.73 కిమీ మైలేజ్ ఇస్తుంది. దేశంలోని సబ్-4 మీటర్ సెడాన్ కార్ల విభాగంలో ఇదే అత్యధిక మైలేజ్ కావడం విశేషం!
E-Paper

