Breast cancer : రొమ్ము క్యాన్సర్ తగ్గాక తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వొచ్చా? లేక ప్రమాదమా?
రొమ్ము క్యాన్సర్ చికిత్స తర్వాత జరిగే మాతృత్వ ప్రయాణంలో అనేక సందేహాలు వేధిస్తుంటాయి. చికిత్స ముగిసాక బిడ్డకు పాలివ్వడం సాధ్యమేనా? దానివల్ల వ్యాధి తిరగబెడుతుందా? బిడ్డకు ప్రమాదం ఉంటుందా? అనే సున్నితమైన అంశాలపై ప్రముఖ ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ భావనా శర్మ అందించిన సమగ్ర విశ్లేషణ మీకోసం.

రొమ్ము క్యాన్సర్ మహమ్మారిని జయించి, పునర్జన్మ పొందిన మహిళలకు మాతృత్వ తీపి పిలుపు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ వంటి కఠినమైన వైద్య చికిత్సలను పూర్తి చేసుకున్న తర్వాత బిడ్డకు పాలు ఇవ్వగలమా లేదా అనే సందేహం వారి మనస్సును తీవ్రంగా తొలిచేస్తుంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా క్యాన్సర్ జయించిన అనేకమంది యంగ్ మదర్స్ ఎదుర్కొంటున్న ఈ ప్రశ్నకు ప్రముఖ ఐవీఎఫ్, లాంజెవిటీ నిపుణురాలు, 'ది లాంజెవిటీ సెంటర్' వ్యవస్థాపకురాలు డాక్టర్ భావనా శర్మ స్పష్టమైన ఆధారాలతో సమాధానం ఇచ్చారు.

క్యాన్సర్ చికిత్స పొందిన మహిళలు అందరూ పాలు ఇవ్వలేకపోవచ్చు లేదా తక్కువ పరిమాణంలో పాలు ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వారు పొందిన శస్త్రచికిత్స రకం, రేడియేషన్ ప్రభావం, వారు ప్రస్తుతం వాడుతున్న క్యాన్సర్ నిరోధక మందులపై ఆధారపడి ఉంటుంది. "క్యాన్సర్ చికిత్స ముగిసిన తర్వాత ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డకు పాలు పట్టడంపై మహిళల్లో అనేక భయాలు ఉండటం సహజం. ప్రసవానికి ముందే తమ ఆంకాలజిస్ట్, ఐవీఎఫ్ నిపుణుల బృందంతో చర్చించి వైద్యపరంగా ఏది సురక్షితమో తెలుసుకోవడం చాలా అవసరం," అని డాక్టర్ భావనా శర్మ పేర్కొన్నారు.

రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ప్రతి తల్లిని వేధించే అతిపెద్ద భయం వ్యాధి మళ్లీ ఎక్కడ వస్తుందో అని! అయితే, విజయవంతంగా చికిత్స పూర్తయిన తర్వాత గర్భం దాల్చడం లేదా బిడ్డకు పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదం పెరుగుతుందని ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు. ప్రముఖ 'అమెరికన్ క్యాన్సర్ సొసైటీ' పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాలు ఇచ్చే సమయంలో రొమ్ములు బరువుగా మారడం, నొప్పులు రావడం సహజం. అయితే ఇవి క్యాన్సర్ లక్షణాలేమోనని తల్లులు అనవసరంగా కంగారు పడుతుంటారు. అందుకే ప్రసవానంతరం కూడా క్రమం తప్పకుండా క్యాన్సర్ కేర్ టీమ్‌తో చెకప్‌లు చేయించుకుంటూ ఉండాలి.

ఇక గతంలో తనకు వచ్చిన క్యాన్సర్ ప్రభావం పాల ద్వారా బిడ్డకు సోకుతుందేమోనన్న అనుమానం కొందరిలో ఉంటుంది. గతంలో వచ్చిన క్యాన్సర్ కణాలు పాల ద్వారా బిడ్డకు వ్యాపించవని వైద్యులు స్పష్టం చేశారు. అయితే తల్లి ప్రస్తుతం వాడే కొన్ని రకాల తీవ్రమైన మందులు పాలల్లో కలిసే అవకాశం ఉంది. తల్లి ఎలాంటి ప్రమాదకరమైన మందులు వాడటం లేదని నిర్ధారించుకున్న తర్వాతే పాలు ఇవ్వడానికి ఆంకాలజిస్టులు సమ్మతిస్తారు.

రొమ్మును పూర్తిగా తొలగించకుండా, కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే తొలగించే శస్త్రచికిత్సను 'లంపెక్టమీ' అంటారు. ఈ సర్జరీ పొందిన మహిళలు బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. అయితే రేడియేషన్ చికిత్స తీసుకున్న రొమ్ము నుంచి పాల ఉత్పత్తి తగ్గవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. రేడియేషన్ వల్ల కణజాలం గట్టిపడటం వల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు. కానీ, శస్త్రచికిత్స జరగని మరొక రొమ్ము నుంచి సాధారణంగానే పాలు ఉత్పత్తి అవుతాయి. ప్రసవానికి ముందే లేదా ప్రసవించిన వెంటనే ల్యాక్టేషన్ స్పెషలిస్ట్ (పాలు ఇచ్చే మార్గదర్శకులు), ఆంకాలజిస్ట్‌ను కలవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిడ్డకు పాలు ఇచ్చే ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

E-Paper

