Jio IPO : జియో ఐపీఓ తగిలితే లాభాలు పక్కా? లేటెస్ట్ జీఎంపీ వివరాలు..
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న 'జియో ప్లాట్‌ఫామ్స్' పబ్లిక్ ఇష్యూకు అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న ప్రారంభం కానున్న ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్, యాంకర్ ఇన్వెస్టర్లు, గ్రే మార్కెట్ ప్రిమియం (జీఎంపీ) సమగ్ర విశ్లేషణ..

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించేందుకు రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్' సిద్ధమైంది. అక్టోబర్ 21న ప్రారంభం కానున్న రూ. 30,188 కోట్ల మెగా ఐపీఓకు ముందే అంతర్జాతీయ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ పబ్లిక్ ఆఫరింగ్ కోసం ఐపీఓ పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా.. దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల మేర కమిట్మెంట్స్ వచ్చినట్లు సమాచారం.

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్ల విండో అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ విభాగంలో కేటాయింపుల కోసం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్లాక్‌రాక్, అలయన్జ్ వంటి అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు సింగపూర్ ప్రభుత్వం, నార్వే గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ఫిడెలిటీ, ఫండ్ దిగ్గజాలు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఇక దేశీయంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)తో పాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ వంటి అగ్రగామి సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా యాంకర్ బుక్ భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, టెలికాం, డిజిటల్ సేవల రంగంలో జియో వేగంగా విస్తరిస్తున్న తీరు ఇన్వెస్టర్లకు బలమైన విశ్వాసాన్ని అందిస్తోంది.

ఇక ఐపీఓ విషయాలకొస్తే.. ప్రతి ఈక్విటీ షేరు ధరను రూ. 1,065 నుంచి రూ. 1,119 గా కంపెనీ నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆపై 12 మల్టిపుల్స్‌లో బిడ్లు దాఖలు చేయవచ్చు. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. .యాంకర్ బిడ్డింగ్ అక్టోబర్ 19న జరుగుతుంది. అర్హులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ. 2,500 కోట్లు, ఉద్యోగుల కోసం రూ. 500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు. అక్టోబర్ 14 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కలిగిన వారు షేర్‌హోల్డర్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. కంపెనీ ఉద్యోగులకు షేరుపై రూ. 54 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్‌లో ఆఫర్ ఫర్ సేల్ విభాగం లేకుండా, పూర్తిగా 27 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నారు. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ గ్రే మార్కెట్ ప్రిమియం భారీగా పలుకుతోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో షేరుపై రూ. 235 వద్ద ప్రిమియం ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,119 కి గ్రే మార్కెట్ ప్రిమియం కలిపితే, లిస్టింగ్ రోజున షేరు ధర రూ. 1,354 వద్ద నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఆఫర్ ధర కంటే దాదాపు 21 శాతం ఎక్కువ లాభాన్ని సూచిస్తోంది. గడిచిన 15 సెషన్లలో జియో జీఎంపీ కాస్త హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, మార్కెట్ నిపుణులు ఈ లిస్టింగ్‌పై సానుకూల అంచనాలను వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో దాదాపు రూ. 27,500 కోట్లను తమ కీలక అనుబంధ సంస్థ 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్' రుణాలను ముందస్తుగా చెల్లించడానికి వినియోగిస్తారు. మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల కంపెనీపై వడ్డీ భారం తగ్గి, లాభదాయకత గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో పెరుగుతున్న 5జీ డిజిటల్ వినియోగం, రిటైల్ రంగానికి లభిస్తున్న మద్దతు జియోకు మరింత బలాన్ని చేకూర్చనుంది. అయితే, ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.

E-Paper

