Death's game : 12 పునర్జన్మల ప్రాణాంతక గేమ్.. మస్ట్ వాచ్ కే- డ్రామా ‘డెత్స్ గేమ్’!
జీవితంపై ఆశ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడికి 'మృత్యుదేవత' ఇచ్చే వినూత్నమైన, కఠినమైన శిక్ష నేపథ్యంలో తెరకెక్కిన సైకిలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'డెత్స్ గేమ్'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్ ట్రెండింగ్‌గా నిలిచిన ఈ కొరియన్ డ్రామా కథాంశం, నటీనటులు, రేటింగ్స్ విశ్లేషణ ఇక్కడ చూడండి..

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కొరియన్ వెబ్ సిరీస్‌లు తీసుకొస్తున్న విప్లవాలు అన్నీ ఇన్నీ కావు. 'స్క్విడ్ గేమ్' అందించిన అంతర్జాతీయ గుర్తింపు తర్వాత, కొరియన్ మేకర్స్ వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ కోవలోనే వచ్చి డిజిటల్ ప్రపంచాన్ని ఊపేసిన మైండ్-బెండింగ్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ 'డెత్స్ గేమ్' (Death's Game). లీ వోన్-సిక్, గుల్చాన్ రాసిన ప్రసిద్ధ వెబ్‌టూన్ ఆధారంగా దర్శకుడు హా బైయుంగ్-హూన్ రూపొందించిన ఈ సిరీస్ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అందుబాటులో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని కొరియన్ కంటెంట్ అభిమానులను, థ్రిల్లర్ ప్రియులను కూడా ఈ సిరీస్ ఎంతగానో నచ్చుతుంది.

అసలు కథ ఏంటి?- చోయ్ యీ-జే అనే యువకుడు ఏడేళ్ల పాటు ఉద్యోగం రాక, కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో పోగొట్టుకుని, చివరికి అద్దె కట్టలేకు ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇక జీవితంలో గెలవలేననే తీవ్ర నైరాశ్యంతో ఆత్మహత్య చేసుకుంటాడు. చావు అనేది తన బాధల నుంచి తప్పించుకునే ఒక సాధనమని భావిస్తూ అతను రాసిన సూసైడ్ నోట్ 'మృత్యుదేవత' (డెత్)కు తీవ్ర కోపం తెప్పిస్తుంది. ఆత్మహత్యతో జీవితాన్ని చులకన చేసిన యీ-జేకు మృత్యుదేవత ఒక వినూత్నమైన, నరకసమానమైన శిక్ష విధిస్తుంది. అతను నరకానికి వెళ్లేముందు 12 వేర్వేరు వ్యక్తుల శరీరాల్లోకి పునర్జన్మ ఎత్తి, 12 రకాల చావులను అనుభవించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆ 12 జన్మలలో దేనిలోనైనా రాబోయే మరణాన్ని తప్పించుకుని సజీవంగా నిలవగలిగితే, ఆ వ్యక్తిగానే అతను మిగిలిన జీవితాన్ని గడిపే హక్కును పొందుతాడు. ఈ 12 రకాల చావుల పోరాటం ద్వారా జీవితం, విలువ, చావు తీవ్రత, మానవ విధి ప్రాముఖ్యత, మరణం తర్వాత తోటి వారు పడే నరకాన్ని అతను ఎలా తెలుసుకున్నాడనేదే ఈ సిరీస్ మూలకథ.

ఈ సిరీస్‌లో నటించిన తారల జాబితా కొరియన్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద స్టార్-స్టడెడ్ కాస్టింగ్‌గా నిలిచింది! చోయ్ యీ-జే పాత్రలో సూర్ ఇన్-గుక్, మృత్యుదేవతగా పార్క్ సో-దమ్ జీవించేశారు. లీ దో-హ్యూన్, గో యూన్-జంగ్, సంగ్ హూన్, చోయ్ సి-వోన్, కిమ్ జీ-హూన్, లీ జే-వుక్, కిమ్ జే-వుక్, ఓ జంగ్-సే వంటి అగ్ర నటీనటులు ఆ 12 విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.
విశేషం ఏమిటంటే.. చోయ్ యీ-జే పాత్రను మొదట ప్రముఖ నటుడు కాంగ్ హా-నెయుల్కు ఆఫర్ చేశారు. ఆ తర్వాత సూర్ ఇన్-గుక్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

ఉత్తమ ప్రొడక్షన్ విలువలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, లోతైన ఫిలాసఫీ కలగలిసి ఉండటంతో ఈ సిరీస్ అంతర్జాతీయ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. టైమ్ మ్యాగజైన్ 2024 నాటి 'టాప్ 9 బెస్ట్ కే-డ్రామాస్' జాబితాలో దీనికి చోటు కల్పించింది. అంతేకాకుండా 2024 'ఆసియా కంటెంట్స్ అవార్డ్స్ & గ్లోబల్ ఓటీటీ అవార్డ్స్' లో బెస్ట్ ఓటీటీ ఒరిజినల్, బెస్ట్ విజ్యూవల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నామినేషన్లు సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో గణాంకాల ప్రకారం.. ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో అత్యధికంగా వీక్షించిన నంబర్ 1 షోగా ఇది రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, జపాన్, మలేషియా, సింగపూర్, తైవాన్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43 దేశాల్లో టాప్-10 గ్లోబల్ ట్రెండింగ్ జాబితాలో నిలిచి కొరియన్ కంటెంట్ సత్తాను చాటిచెప్పింది.

E-Paper

