How to invest : అస్థిర ఆదాయంతో పెట్టుబడులు.. ఫ్రీలాన్సర్లు, వ్యాపారులకు సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది..
నెలనెలా స్థిరమైన జీతం లేని ఫ్రీలాన్సర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు మ్యూచువల్ ఫండ్లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక, అసెట్ అలోకేషన్, ఎమర్జెన్సీ ఫండ్ రూపకల్పనపై ముంబై ఆధారిత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రాహుల్ మెహ్తా చెబుతున్న కీలక అంశాలు ఇవి..

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ఐటీ కన్సల్టెంట్లు, స్వయం ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపారులు, ట్రేడర్లు ఉన్నారు. వీరి ఆదాయం ఏ నెలలో ఎంత వస్తుందో కచ్చితంగా చెప్పలేం. కొన్ని నెలలు వ్యాపారం లేదా ప్రాజెక్టులు బాగుంటే భారీగా నగదు అందుతుంది, మరికొన్ని నెలలు రాబడి చాలా తక్కువగా ఉంటుంది. ఒకే ఒక పెద్ద బిల్లు లేదా ఇన్వాయిస్ సొమ్ము విడుదల కావడానికి నెలల సమయం పట్టవచ్చు. ఇలాంటి వారికి సాధారణ ఎస్ఐపీ మోడల్ పాటించడం కష్టంగా మారడమే కాకుండా, మనశ్శాంతిని దూరం చేస్తుంది. అస్థిర ఆదాయం ఉన్నవారు తమ భవిష్యత్తు కోసం నిధులను ఎలా సమకూర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
స్థిరమైన ఆదాయం లేనివారు చేసే ప్రధాన పొరపాటు ఎస్ఐపీ నిలిచిపోగానే ఆందోళన చెందడం. ఒక నెల ఆదాయం తగ్గడం వల్ల ఎస్ఐపీ మిస్ అయితే క్రమశిక్షణ తప్పామని భావించి పెట్టుబడులను పూర్తిగా ఆపివేస్తుంటారు. దీనికి పరిష్కారం ప్లానింగ్ విధానాన్ని మార్చడమే. నెలవారీ కట్టుబాటుకు బదులుగా, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంత మొత్తం పొదుపు చేయాలనే వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ప్రాజెక్టులు బాగా ఉండి ఎక్కువ డబ్బులు వచ్చిన నెలలో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. రాబడి లేని నెలల్లో తక్కువ మొత్తాన్ని లేదా ఏమీ ఇన్వెస్ట్ చేయకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. "ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలి" అనే నియమానికి బదులుగా "చేతికి అదనపు సొమ్ము వచ్చినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయాలి" అనే సూత్రాన్ని అలవాటు చేసుకోవాలి.

అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు జమ అయినప్పుడు, ఆ సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే గందరగోళం ఎదురవుతుంది. ప్రణాళిక లేకపోతే ఆ సమయంలో మార్కెట్లో ఏ రంగం లేదా ఏ ఫండ్ వేగంగా పెరుగుతుందో దానివైపు పరుగులు తీసే ప్రమాదం ఉంది. ఈ అయోమయాన్ని నివారించడానికి ముందుగానే స్థిరమైన 'అస్సెట్ అలోకేషన్' నిష్పత్తిని ఖరారు చేసుకోవాలి. ఉదాహరణకు, 60 శాతం ఈక్విటీ (స్టాక్ మార్కెట్), 30 శాతం డెబ్ట్ (సురక్షిత డెబ్ట్ ఫండ్లు), 10 శాతం గోల్డ్ (బంగారం) అనే నిష్పత్తిని ఖరారు చేసుకుంటే, చేతికి డబ్బులు రాగానే ఆలోచించకుండా ఆ నిష్పత్తిలోనే కేటాయింపులు చేయవచ్చు. ఇది అనవసరపు రిస్క్‌లను తగ్గిస్తుంది.

సాధారణ ఉద్యోగులకు 6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ సరిపోతుంది. కానీ, అస్థిర ఆదాయం ఉన్నవారు కనీసం 9 నుంచి 12 నెలల నిత్య జీవిత ఖర్చులకు సరిపడా నిధిని వేరుగా ఉంచుకోవాలి! వ్యాపారం లేదా ప్రాజెక్టులు లేని సమయంలో మార్కెట్లు కూడా పతనమైతే, నిత్యవసరాల కోసం ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులను నష్టానికి విక్రయించాల్సి వస్తుంది. అలా జరిగితే ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే తగినంత ఎమర్జెన్సీ ఫండ్. డెట్ కేటాయింపులు పూర్తయిన తర్వాత మాత్రమే ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం సురక్షితమైన పద్ధతి.

అనుకోకుండా పెద్దమొత్తంలో పేమెంట్ వచ్చినప్పుడు ఆ సొమ్మును మార్కెట్ గరిష్ఠాల వద్ద అత్యధికంగా రిటర్నులు ఇచ్చే థీమాటిక్ లేదా సెక్టోరియల్ ఫండ్లలో పెట్టాలనే తొందరపాటు ఎక్కువమందిలో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ. కఠినమైన నిబంధనలతో ముందే అనుకున్న అస్సెట్ అలోకేషన్ ప్రకారం మాత్రమే ఆ నిధులను మళ్లించాలి. ఎంత పెద్దమొత్తం వచ్చినా దానిని ఈక్విటీ, డెబ్ట్, గోల్డ్ విభాగాలకు ముందే అనుకున్న నిష్పత్తిలోనే కేటాయించాలి. సింపుల్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించండి ఆర్థిక సలహాదారుల సాయం లేకుండా సొంతంగా ఇన్వెస్ట్ చేసేవారు క్లిష్టమైన ఫండ్లను ఎంచుకోకూడదు. ఈక్విటీ విభాగానికి పాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఎంతో సురక్షితమైనవి మరియు స్పష్టమైనవి. డెట్ కేటాయింపుల కోసం షార్ట్-డ్యూరేషన్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్లు లేదా బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్లను ఎంచుకోవచ్చు. పసిడి కేటాయింపులకు సింపుల్ గోల్డ్ ఈటీఎఫ్ సరిపోతుంది. పోర్ట్‌ఫోలియో నిర్వహణలో సరైన ప్రణాళిక, ఆత్మనిగ్రహం ఉంటేనే అస్థిర ఆదాయం ఉన్నవారు కూడా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించగలుగుతారు.

E-Paper

