Diwali 2026 Gemini AI : జెమినీ ఏఐతో మీ 'దీపావళి విషెస్'ని మీరే క్రియేటివ్‌గా క్రియేట్ చేసుకోండిలా..
ఈ దీపావళికి వాట్సాప్‌లో పాతబడిపోయిన ఫార్వర్డ్ మెసేజ్‌లకు గుడ్‌బై చెప్పండి. గూగుల్ జెమినీ ఏఐ సాయంతో మీ స్నేహితులు, బంధువులు, ఆఫీస్ సహోద్యోగుల కోసం నూతన తరహా డిజిటల్ శుభాకాంక్షలు, ఇమేజ్‌లు ఎలా సృష్టించాలో ఇక్కడ తెలుసుకోండి..

వెలుగుల పండుగ దీపావళి వేళ ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్ వాట్సాప్ ఇన్‌బాక్స్.. పాతబడిపోయిన ఫార్వర్డ్ మెసేజ్‌లు, ఫార్వర్డెడ్ వీడియోలతో నిండిపోతుంది. ఒకే సందేశాన్ని పదుల సంఖ్యలో గ్రూపుల్లో చూసినప్పుడు అందులో ఎలాంటి ఆప్యాయతా కనిపించదు! ఈ పండుగ వేళ మీ ఆత్మీయులకు, కార్యాలయ భాగస్వాములకు డిజిటల్ రూపంలో వినూత్నంగా, వారి అభిరుచులకు తగినట్లు శుభాకాంక్షలు పంపాలనుకుంటున్నారా? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను ఉపయోగించి సరికొత్త మెసేజ్‌లు, కంటికింపుగా ఉండే ఇమేజ్‌లను సులువుగా సృష్టించవచ్చు.

జెమినీ ద్వారా మీకు కావాల్సిన శైలిలో మెసేజ్ పొందడానికి సరైన ‘ప్రాంప్ట్’ ఇవ్వడం అత్యంత ముఖ్యం. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 'Google Gemini' యాప్‌ను ఓపెన్ చేయండి లేదా బ్రౌజర్‌లో gemini.google.com వెబ్‌సైట్‌కు వెళ్లి మీ గూగుల్ ఖాతాతో లాగిన్ అవ్వండి. కేవలం "దీపావళి శుభాకాంక్షలు రాయి" అని కాకుండా, స్పష్టమైన సమాచారం ఇవ్వండి. ఉదాహరణకు: "నా ఆఫీస్ సహోద్యోగుల కోసం 50 పదాల్లో, రాబోయే సంవత్సరంలో విజయం, ఐశ్వర్యం కోరుకుంటూ ఒక ఆత్మీయమైన దీపావళి సందేశాన్ని రాయి" అని టైప్ చేయండి. జెమినీ ఇచ్చిన మొదటి జవాబు నచ్చకపోతే, "దీనిని కాస్త హాస్యభరితంగా మార్చు", "కవితాత్మకంగా రాయి" లేదా "తెలుగులోకి అనువదించు" అని అడిగి మీకు కావాల్సిన రీతిలో మార్పించుకోవచ్చు. టెక్ట్స్ సరిగ్గా కుదిరిన తర్వాత, కింద ఉన్న కాపీ ఐకాన్ పై క్లిక్ చేసి, వాట్సాప్ చాట్‌లోకి వెళ్లి పేస్ట్ చేసి పంపేయండి!

బిజినెస్, ఆఫీస్ విషెస్ కోసం.. "నా క్లయింట్ కోసం 40 పదాల్లో ప్రొఫెషనల్ దీపావళి సందేశం రాయి. మా భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి బృందానికి విజయం, శాంతి లభించాలని కోరుకో," అని ఇన్పుట్ ఇస్తే.. "మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ టీమ్ మొత్తానికి దీపావళి శుభాకాంక్షలు! మాపై ఉంచిన నమ్మకానికి, నిరంతర భాగస్వామ్యానికి ధన్యవాదాలు. ఈ దీపావళి వెలుగులు మీ వ్యాపారంలో నూతన అవకాశాలను, విజయాలను నింపాలని కోరుకుంటున్నాం!' అని ఔట్పుట్ వస్తుంది. మీకు నచ్చకపోతే మరొకటి కూడా అగడవచ్చు.

వాట్సాప్ ఫీడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించేలా కస్టమ్ ఇమేజ్‌లను కూడా జెమినీ క్షణాల్లో డిజైన్ చేస్తుంది. జెమినీ చాట్ బాక్స్‌లో ఇమేజ్ క్రియేట్ చేయమని అడుగుతూ నేపధ్యం, అలంకరణ వివరాలు తెలపండి. ఉదాహరణకు: "చుట్టూ చుక్కల ఆకాశం కింద, బంతి పూల మాలలతో, వందలాది మట్టి ప్రమిదల వెలుగులతో మెరిసిపోతున్న సాంప్రదాయ భారతీయ ఇంటి ప్రాంగణం ఇమేజ్‌ను హెచ్‌డీ క్వాలిటీలో జనరేట్ చేయి," అని ప్రాంప్ట్ ఇవ్వండి. జెమినీ కొన్ని డిజైన్ వర్షన్లను చూపిస్తుంది. మీకు నచ్చిన చిత్రంపై టాప్ చేసి ఫుల్ స్క్రీన్‌లో చూసి, డౌన్‌లోడ్ ఐకాన్ నొక్కి మీ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లో అటాచ్‌మెంట్ ఐకాన్ క్లిక్ చేసి, సేవ్ చేసిన చిత్రాన్ని ఎంచుకుని, దాని కింద క్యాప్షన్ బాక్స్‌లో మీరు ముందుగా క్రియేట్ చేసుకున్న టెక్ట్స్ మెసేజ్ పేస్ట్ చేసి సెండ్ నొక్కండి.

మెరుగైన ఔట్పుట్ కోసం.. మీరు ఎంచుకున్న ఇమేజ్ డిజైన్‌కు, టెక్ట్స్ సందేశ శైలికి పొంతన ఉండేలా చూసుకోండి. ఆధునిక మినిమలిస్ట్ డిజిటల్ కార్డు ఎంచుకుంటే, టెక్ట్స్ కూడా అంతే చిన్నగా, స్పష్టంగా ఉండేలా ప్రాంప్ట్ ఇవ్వండి. కొద్దిపాటి ప్రయోగాలతో మీ బంధువులు, మిత్రులు, వ్యాపార శ్రేయోభిలాషులకు సరికొత్త రీతిలో పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఆశ్చర్యపరచండి.

E-Paper

