ఫొటోలు : సరికొత్త రూపంలో మాదాపూర్ తమ్మిడికుంట చెరువు - రూ. 20 కోట్లతో ఆధునికీకరణ
Thammidikunta Lake Madhapur : హైదరాబాద్ మాదాపూర్‌లోని చారిత్రాత్మక తమ్మిడికుంట చెరువును హైడ్రా ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. 30 ఎకరాలకు విస్తరించిన ఈ చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం… సరికొత్త టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది.

హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీ కారిడార్‌కు గుండెకాయలాంటి మాదాపూర్‌లోని చారిత్రాత్మక తమ్మిడికుంట చెరువుకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది.

శిల్పారామం ఎదురుగా ఉన్న ఈ చెరువును 'హైడ్రా' (HYDRAA) ఆధ్వర్యంలో సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దారు. పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో నవంబర్ 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

గతంలో ఆక్రమణలు, మురుగునీరు, చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో తీవ్రంగా దెబ్బతిన్న తమ్మిడికుంట చెరువును హైడ్రా ప్రత్యేక చొరవతో రక్షించింది. ఆక్రమణల కారణంగా ఒకప్పుడు కేవలం 14 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువు విస్తీర్ణాన్ని, అధికారులు తిరిగి సుమారు 30 ఎకరాలకు పునరుద్ధరించడం విశేషం. చెరువులో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఒకప్పుడు నిర్మాణ వ్యర్థాలు, చెత్త, బయోమెడికల్ వేస్ట్ డంపింగ్ యార్డుగా మారి దుర్గంధం వెదజల్లిన తమ్మిడికుంట, ఇప్పుడు ఆ వ్యర్థాలన్నింటినీ వదిలించుకుని పర్యావరణ హితంగా, ఆరోగ్యకరంగా మారింది. చెరువు నుంచి 30 వేల ట్రక్కులకు పైగా పూడికను తొలగించడంతో దుర్గంధభరిత వాతావరణం పూర్తిగా మాయమైంది.

హైడ్రా అభివృద్ధికి ముందు, తర్వాత అన్నట్లుగా తమ్మిడికుంట పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. చెరువు చుట్టూ సుమారు 1.6 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ (పాత్ వే), అత్యాధునిక ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలం, యోగా వేదిక, ఆకర్షణీయమైన గార్డెన్లు, సందర్శకుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని వయసుల వారికి ఇవి ఆరోగ్య ప్రదాయినిలుగా మారాయి. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం, నడక, విశ్రాంతి తీసుకునే అద్భుతమైన అవకాశం లభించింది.

తమ్మిడికుంట చెంత పరచుకున్న పచ్చదనం సందర్శకులకు కనువిందు చేస్తోంది. చెరువును చూసేందుకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వేదిక మధ్యలో 60 ఏళ్ల నాటి బోన్సాయ్ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెరువు చుట్టూ వేలాది మొక్కలు నాటి పచ్చదనానికి పెద్దపీట వేశారు.

వర్షాకాలంలో వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధి వంటి చెరువుకు ఉండే సహజ లక్షణాలన్నీ తిరిగి సమకూరాయి. హైదరాబాద్‌ను తిరిగి 'సిటీ ఆఫ్ లేక్స్'గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంలో తమ్మిడికుంట అభివృద్ధి మరో కీలక ముందడుగుగా నిలిచింది.

E-Paper

