IRCTC Coastal Karnataka Tour Package : హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ... ఈ పుణ్యక్షేత్రాలను చూడొచ్చు! పూర్తి వివరాలు
IRCTC Coastal Karnataka Tour Package : ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఉడిపి, మురుడేశ్వర్, శృంగేరి, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాలను సందర్శించుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

కోస్తా కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు, భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
(images from Unsplash)
'కోస్టల్ కర్ణాటక' (Coastal Karnataka) పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీ కోడ్ SHR085. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర సికింద్రాబాద్ సమీపంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రాబోయే యాత్ర 2026 అక్టోబర్ 20 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ ద్వారా ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, మురుడేశ్వర్, శృంగేరి శారదాంబ పీఠం, హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం, కొల్లూరు మూకాంబిక ఆలయం, గోకర్ణ మహాబలేశ్వర స్వామి ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటి ప్రసిద్ధ దివ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

ఫస్ట్ డే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు రైలు నంబర్ 12789 (కాచేగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) లో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 09:15 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనంలో ఉడుపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రికి ఉడుపిలోనే బస ఉంటుంది.

మూడో రోజు (గురువారం) ఉదయాన్నే గోకర్ణకు బయలుదేరి అక్కడ మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ ఆలయాన్ని, కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనాల తర్వాత తిరిగి ఉడుపి చేరుకుని రాత్రి బస చేస్తారు.
నాలుగో రోజు (శుక్రవారం) ఉడుపి హోటల్ చెకౌట్ చేసి హొరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాక శృంగేరికి చేరుకుని శ్రీ శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఐదో రోజు (శనివారం) హోటల్ చెకౌట్ చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్తారు. దర్శనం ముగించుకుని తిరిగి మంగళూరు చేరుకుంటారు. సాయంత్రం 19:00 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుని, రాత్రి 20:00 గంటలకు రైలు నంబర్ 12790 ద్వారా తిరుగు ప్రయాణమవుతారు. ఆరో రోజు (ఆదివారం) రాత్రి 23:40 గంటలకు కాచేగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది

రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3AC), ఏసీ వాహనంలో రవాణా, 3 రాత్రుల హోటల్ బస, 3 రోజులు ఉదయం అల్పాహారం (Breakfast), ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్-పార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ ఈ ప్యాకేజీలోనే కలిసి ఉంటాయి. మధ్యాహ్న, రాత్రి భోజనాలు, రైలులోని ఆహారం, ఆలయాల వద్ద ప్రవేశ టికెట్లు, పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి వ్యక్తిగత ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్ ధరలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

E-Paper

