IRCTC Ooty Tour Package : హైదరాబాద్ టు ఊటీ... ఈ సెలవుల వేళ మీకోసమే IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ, ఇవే వివరాలు
IRCTC Ooty Tour Package : హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ సందర్శించేందుకు ఐఆర్సిటీసీ 'అల్టిమేట్ ఊటీ' ప్యాకేజీని తీసుకొచ్చింది. 6 రోజులపాటు సాగే ఈ ప్రయాణం… ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హిల్ స్టేషన్లలో ఊటీ ఒకటి. ఎత్తైన కొండలు, తేయాకు తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకునే ఊటీని సందర్శించాలనుకునే హైదరాబాద్ ప్రజల కోసం ఐఆర్సిటీసీ టూరిజం ఒక అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
(Image source Unsplash)
'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' (ప్యాకేజీ కోడ్: SHR094) పేరుతో 5 రాత్రులు, 6 రోజుల రైలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్ 20వ తేదీన అందుబాటులో ఉంది. ఈ దసరా సెలవుల వేళ ఊటీ అందాలను వీక్షించేందుకు ఈ ప్యాకేజీ బెస్ట్ అని చెప్పొచ్చు. .

ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ఊటీ మరియు కూనూర్‌లోని ఎన్నో అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రతి వారం మంగళవారం రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 14:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20629) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌తో పాటు నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్ల మీదుగా వెళ్తుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో ఉదయం 09:10 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో ఊటీకి (90 కిలోమీటర్ల ప్రయాణం) తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత, మధ్యాహ్నం నుంచి బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్‌లను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది

మూడో రోజు హోటల్లో ఉదయం అల్పాహారం పూర్తి చేసుకున్న తర్వాత దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతాలను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస చేస్తారు. నాల్గో రోజు టిఫిన్ ముగించుకుని కూనూర్ సైట్ సీయింగ్‌కు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీ చేరుకుంటారు. ఆ రాత్రికి ఊటీలోనే విశ్రాంతి తీసుకుంటారు. ఐదో రోజు అల్పాహారం తిన్న తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ చెక్ అవుట్ చేసి కోయంబత్తూర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 15:40 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20630) ఎక్కుతారు. ఆరవ రోజు (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.

ఈ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే తరగతి (Standard Sleeper / Comfort 3AC) మరియు సీజన్‌ను బట్టి మారుతుంటాయి. డిసెంబర్ 15 వరకు ఉండే చార్జీల వివరాలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 31,050, ట్విన్ (ఇద్దరు) షేరింగ్ కు రూ. 16,360/- (ఒక్కొక్కరికి), ట్రిపుల్ (ముగ్గురు) షేరింగ్ కు రూ. 14,630 (ఒక్కొక్కరికి)గా నిర్ణయించారు. ఈ ధరలు స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్)లో ఉంటాయి. కంఫర్ట్ కేటగిరీ (3rd AC)లో చూస్తే… సింగిల్ షేరింగ్: రూ. 33,590, ట్విన్ షేరింగ్ కు రూ. 18,890/- (ఒక్కొక్కరికి), ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17,170 (ఒక్కొక్కరికి)గా ఉంది.

ఈ ప్యాకేజీ కింద స్లీపర్ లేదా 3AC రైలు టికెట్లు, పర్యాటక ప్రదేశాలు తిరిగేందుకు ఎసి వాహనం, ఊటీలో 3 రాత్రుల నాన్-ఎసి హోటల్ బస, ఉదయం టిఫిన్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ మరియు పార్కింగ్ ఛార్జీలు కవర్ అవుతాయి. అయితే మధ్యాహ్న, రాత్రి భోజనాలు, ప్రవేశ టికెట్లు, బోటింగ్ వంటి వ్యక్తిగత ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన ప్రయాణికులు ఐఆర్సిటీసీ అధికారిక వెబ్సైట్ (www.irctctourism.com) ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇతర టూర్ ప్యాకేజీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

E-Paper

