స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ.. జనసేన ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కూటమి పోటీపై క్లారిటీ వచ్చింది. కలిసే పోటీ చేయనున్నట్టుగా జనసేన ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జనసేన పార్టీ ప్రతినిధి బృందం నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. అమరావతిలో జరిగిన ఈ భేటీలో పొత్తులు, క్షేత్రస్థాయి బలాబలాలు, సీట్ల పంపిణీకి సంబంధించిన పలు అంశాలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం ముగిసిన అనంతరం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగానే పోటీ చేస్తాయని పునరుద్ఘాటించారు.

'సమావేశంలో రెండు పార్టీల నేతల మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదిరింది. కూటమిలోని ఏ భాగస్వామ్య పార్టీ మనోభావాలు దెబ్బతినకుండా, కేడర్లో అసంతృప్తి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏ పార్టీకి ఇన్ని సీట్లు ఇవ్వాలనే సంఖ్యాపరమైన లెక్కలేవీ ఇంకా ఖరారు చేయలేదు. క్షేత్రస్థాయి ప్రాధాన్యతలు, స్థానిక పరిస్థితుల ఆధారంగానే పోటీ చేసే స్థానాలను నిర్ధారిస్తాం.' అని బొలిశెట్టి పేర్కొన్నారు.

అభ్యర్థుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, రాబోయే రెండు రోజుల్లో మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటును ముగిస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే కూటమి తరఫున అధికారికంగా అభ్యర్థుల సంయుక్త జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా జనసేన నేతలతో చర్చలు ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమై స్థానిక ఎన్నికల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్డీయే కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి.

E-Paper

