Jasprit Bumrah : 5 మ్యాచులు- 0 వికెట్లు! మన బూమ్.. బూమ్.. బుమ్రాకు ఏమైంది?
bumrah wickets ipl 2026 : ఐపీఎల్ అభిమానుల్లో ఇప్పుడు రెండే రెండు విషయాలు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఒకటి 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం, ఇంకొకటి జస్ప్రీత్ బుమ్రా ఇంకా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం! మరీ ముఖ్యంగా బుమ్రా పరిస్థితి అటు ముంబై ఇండియన్స్‌ని, ఇటు ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ ఇప్పుడు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో బుమ్రా వికెట్లు తీయడానికి నానా తంటాలు పడుతున్నాడు. గురువారం వాంఖెడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా తేలిపోయాడు. 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 41 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడింది. ఈ ఐదింటిలోనూ బుమ్రా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు.
(AFP)
బుమ్రా వైఫల్యంపై ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర విశ్లేషణ చేశారు. "బుమ్రా వికెట్లు తీయడం ముంబైకి చాలా ముఖ్యం. అతని ఫామ్‌లో పెద్ద సమస్య లేదు కానీ, వేగమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సీజన్‌లో బుమ్రా సగటు వేగం 130 కిలోమీటర్లు మాత్రమే ఉంటోంది. దీనికి కారణం అతను వేస్తున్న స్లోయర్ బాల్స్," అని పఠాన్ పేర్కొన్నాడు.
(PTI)
పఠాన్ ప్రకారం.. బుమ్రా తన బౌలింగ్‌లో దాదాపు 44 శాతం స్లోయర్ డెలివరీలనే వేస్తున్నాడు. అంటే ప్రతి రెండో బంతి స్లోయర్ బాల్‌గా మారుతోంది. స్లో బాల్స్ ఎక్కువ అవ్వడం వల్ల అతని సగటు వేగం 130 కి.మీ కంటే తక్కువకు పడిపోయింది. స్లోయర్ బాల్స్ శాతాన్ని 30 నుంచి 35 శాతానికి తగ్గించి, అసలైన పేస్‌తో బంతులు వేస్తే బుమ్రా మళ్లీ వికెట్లు తీయగలడు.
"బుమ్రాకు కోచింగ్ అవసరం లేదు, కానీ గణాంకాలు ఏం జరుగుతుందో స్పష్టంగా చెబుతున్నాయి. పేస్ పెంచి, స్లో బాల్స్‌ను ఒక ఆయుధంగా మాత్రమే వాడితే అవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి," అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఆడిన 5 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కి బుమ్రా వికెట్లు తీయడం చాలా ముఖ్యం.
E-Paper

