Supplements : రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటున్న Kim Kardashian! శరీరానికి మంచిదేనా?
Kim Kardashian : తాను రోజుకు దాదాపు 35 రకాల హెల్త్ సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లు వెల్లడించి సంచలనం సృష్టించింది ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియన్. ఇంత భారీ మొత్తంలో సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రముఖ నటి ఏమీ పోహ్లర్ పాడ్‌కాస్ట్‌లో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ.. తాను రోజుకు 35 సప్లిమెంట్లను మూడు డోసులుగా విభజించి తీసుకుంటానని, ఈ రొటీన్ వల్ల తనకు ‘పిల్ ఫెటీగ్’ (టాబ్లెట్లు మింగి విసుగు చెందడం) కూడా వస్తుందని ఒప్పుకుంది.
ఈ నేపథ్యంలో వైద్యులు ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తున్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతాయి కదా అని మల్టీవిటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వాడితే శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే తెలిపిన వివరాల ప్రకారం.. సప్లిమెంట్ల అతి వినియోగం వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి..
విటమిన్లు, మినరల్స్ శాతాన్ని గమనించకుండా సొంతంగా వాడటం వల్ల శరీరంలోని వివిధ అవయవాలు ఒత్తిడికి గురవుతాయి. ముఖ్యంగా ఫ్యాట్-సోల్యూబుల్ (కొవ్వులో కరిగే) విటమిన్లయిన విటమిన్ ఏ, డీ, ఈ, కే,, శరీరంలో అదనంగా పేరుకుపోతాయి. ఇవి నీటి ద్వారా బయటకు పోవు కాబట్టి కాలక్రమేణా టాక్సిసిటీగా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి! ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ మోతాదు మించితే మూత్రపిండాలలో రాళ్లు (ఏర్పడటం, కిడ్నీలు దెబ్బతినడం, లివర్ (కాలేయం) ఒత్తిడికి గురికావడం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అనేక జీర్ణక్రియ సమస్యలు కూడా చూస్తారు.
సప్లిమెంట్లు నిజంగా ఎవరికి అవసరం? - రక్తపరీక్షల్లో విటమిన్ లోపాలు బయటపడిన వారు, అనీమియా (రక్తహీనత) లేదా ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) ఉన్నవారు, గర్భిణీలు, కఠినమైన డైట్ నియమాలు పాటించేవారు, వృద్ధాప్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు సప్లిమెంట్లు తీసుకోవాలి.
"ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం మాత్రమే పునాదులు. సప్లిమెంట్లు ఎప్పుడూ ఆహారానికి ప్రత్యామ్నాయం కావు," అని డాక్టర్ దిలీప్ తెలిపారు. మీ శరీరానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకుని, డాక్టర్ పర్యవేక్షణలోనే తగిన మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం సురక్షితమైన మార్గం.
E-Paper

