ఉత్తర కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్ - ఈ తేదీల్లో భారీ వర్ష సూచన..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బుధవారం నాటికి తీవ్ర తుఫానుగా మారి ఉత్తర కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

బంగాళాఖాతంలో మరో పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ వాతావరణ వ్యవస్థ మరింత బలపడి, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే ప్రమాదం ఉందని వివరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఆదివారం(ఇవాళ) అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత మరింత వేగం పుంజుకుని సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, అదే రోజు సాయంత్రానికి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.

ఇది అంతటితో ఆగకుండా బుధవారం నాటికి 'తీవ్ర తుఫాను'గా బలపడి, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. తుఫాను తీరం దాటే క్రమంలో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది.

తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తీర ప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని… తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

E-Paper

