హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు.. పరిశుభ్ర నగరాల జాబితాలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు!
కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నగరాలు సత్తా చాటాయి! అనేక విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు తమ ర్యాంకులను సైతం మెరుగుపరుచుకున్నాయి. ఇక మహారాష్ట్రలోని నవీ ముంబై దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా నగరాల పరిశుభ్రతకు అద్దం పట్టే కేంద్ర ప్రభుత్వ 'స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2025-26' ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ పరిశుభ్ర నగరాల విభాగంలో మహారాష్ట్రలోని నవీ ముంబై దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానాన్ని దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. దిలోని విజ్ఞాన్ భవన్లో ఇటీవలే జరిగిన ఈ 10వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేశారు. ఈసారి జరిగిన సర్వేలో తెలుగు రాష్ట్రాల నగరాలు అనేక విభాగాల్లో సత్తా చాటడం విశేషం. విజయవాడతో పాటు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కుప్పం, రాజమండ్రి, గ్రేటర్ హైదరాబాద్ నగరాలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి.

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, 2017 నుంచి 2023 వరకు వరుసగా అగ్రస్థానంలో నిలిచిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (2023లో సూరత్‌తో కలిసి సంయుక్తంగా) 2024-25లో 'సూపర్ స్వచ్ఛ లీగ్'లోకి వెళ్లింది. దీనితో ఇండోర్ ప్రధాన ర్యాంకింగ్స్ పోటీలో లేదు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ షెహర్ జోడీ' (మెంటర్-మెంటీ నగరాలు) కార్యక్రమంలో ఇండోర్ మార్గదర్శక నగరంగా వ్యవహరించింది. 2021, 2022, 2023, 2024 ఎడిషన్లలో కనీసం మూడుసార్లు తమ జనాభా విభాగంలో టాప్-3లో నిలిచిన నగరాలతో ఈ సూపర్ స్వచ్ఛ లీగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ లీగ్ నగరాలకు అదనపు ప్రమాణాల ఆధారంగా మదింపు నిర్వహిస్తారు. వీటి మధ్య పరస్పర ర్యాంకులు ఉండవు కానీ, లీగ్‌లో కొనసాగాలంటే కనీసం 85 శాతం స్కోరు సాధించాలి.

పరిశుభ్రతలో ముందున్న నగరాలు వెనుకబడిన పట్టణాలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం 'స్వచ్ఛ షెహర్ జోడీ' విభాగాన్ని తీసుకొచ్చింది. ఇందులో 70 మెంటర్ నగరాలను 191 మెంటీ పట్టణాలతో జత చేశారు. 2024-25 విజేత అయిన అహ్మదాబాద్ తన భాగస్వామ్య పట్టణం సనంద్తో కలిసి ఈ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్-దేపాల్‌పూర్ జోడీ రెండో స్థానం దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి-కుప్పం జోడీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 4,700కు పైగా నగరాలను 43 ప్రమాణాల ఆధారంగా పరిశీలించారు. చెత్త వేర్పాటు, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, కంటికి కనిపించే పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం వంటి 10 కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 12,500 మార్కులకు గాను క్షేత్రస్థాయి పరిశీలన, పౌరుల అభిప్రాయాలకు 10,500 మార్కులు, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్), చెత్త రహిత ధ్రువీకరణకు 2,000 మార్కులు కేటాయించారు. 3,000 మందికి పైగా శిక్షణ పొందిన అసెసర్లు రియల్-టైమ్ జీపీఎస్ పర్యవేక్షణ, పూర్తి డిజిటల్ ధ్రువీకరణ ద్వారా మార్కులు వేశారు. వ్యర్థాల శుద్ధికి 15 శాతం, చెత్త వేర్పాటు, సేకరణ, రవాణాకు 10 శాతం మార్కులు ఇచ్చారు.
జనాభా ఆధారిత విభాగాల్లో తెలుగు నగరాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. జబల్పూర్, లక్నో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో ఉజ్జయిని మొదటి స్థానం, చండీగఢ్ రెండో స్థానం సాధించగా, గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. 50 వేల నుంచి 3 లక్షల జనాభా విభాగంలో దేవాస్ అగ్రస్థానం దక్కించుకోగా, దిల్లీ మున్సిపల్ కౌన్సిల్, సాగర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 20 వేల నుంచి 50 వేల జనాభా విభాగంలో మహారాష్ట్రలోని వీటా (మొదటి), అస్కా (రెండో), పనాజీ (మూడో) నిలిచాయి. 20 వేల కంటే తక్కువ జనాభా విభాగంలో బిల్హా, పంచగని, బుధ్ని తొలి మూడు స్థానాలు పొందాయి.

ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 నగరాలకు 'స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ సిటీ' అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాయి. అసోం నుంచి గువాహటి, బిహార్ నుంచి పట్నా, ఒడిశా నుంచి భువనేశ్వర్, రాజస్థాన్ నుంచి జైపూర్, కర్ణాటక నుంచి మైసూరు, పశ్చిమ బెంగాల్ నుంచి తారకేశ్వర్ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న పట్టణాల్లోనూ గణనీయమైన మార్పు కనిపించింది. 2024-25తో పోలిస్తే 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 1,700కు పైగా పట్టణ స్థానిక సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకోగా, 350కు పైగా సంస్థలు ఏకంగా 500 స్థానాలకు పైగా ఎగబాకాయి. ఈ సర్వేలో దాదాపు 2.7 కోట్ల మంది (27 మిలియన్లు) పౌరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

E-Paper

