Papikondalu Tourism : పర్యాటకులకు శుభవార్త - నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం!
Papikondalu Tourism : గోదావరి వరదల కారణంగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర 70 రోజుల విరామం తర్వాత మంగళవారం(ఇవాళ్టి) నుంచి మళ్లీ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ అనుమతులతో బోట్లు సిద్ధమయ్యాయి.

ప్రకృతి అందాలకు నిలయమైన పాపికొండలు విహారయాత్రకు మళ్లీ వేళయింది. తూర్పు కనుమల నడుమ గోదావరి ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు అధికారులు తీపి కబురు అందించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం సమీపంలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయ విహారయాత్ర ప్రాంగణం నుంచి మంగళవారం(అక్టోబర్ 13) నుంచి బోట్లు పునఃప్రారంభం కానున్నాయి.
ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదికి తీవ్రస్థాయిలో వరదలు పోటెత్తడంతో పర్యాటకుల రక్షణ దృష్ట్యా జులై 30వ తేదీన జలవనరుల శాఖ అధికారులు ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రస్తుతం నదిలో నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు వాతావరణం అనుకూలించడంతో సుదీర్ఘంగా 70 రోజుల విరామం తర్వాత యాత్రను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

విహారయాత్రను పునఃప్రారంభించడానికి రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్ సోమవారం అనుమతులు మంజూరు చేశారు. పర్యాటకుల రాక కోసం ఏపీటీడీసీ (APTDC)కి చెందిన ఒక బోటుతో పాటు 15 ప్రైవేట్ పర్యాటక బోట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు.

బోట్లలో భద్రతా ప్రమాణాలు పరిశీలించిన అనంతరమే ప్రయాణానికి అనుమతినిస్తున్నారు. విహారయాత్ర పునఃప్రారంభంపై ప్రకటన రావటంతో…. పర్యాటక రంగ నిర్వాహకులు, స్థానిక గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

E-Paper

