వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి ఆస్తమా, సీఓపీడీ బాధితులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ విషకణాలు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సప్నా యాదవ్ వివరిస్తున్నారు.

"ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు కలుషిత గాలిని నిరంతరం పీల్చితే వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఆకస్మిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది," అని గ్రేటర్ నోయిడాలోని సర్వోదయ హాస్పిటల్ పల్మనాలజీ, స్లీప్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సప్నా యాదవ్ హెచ్చరించారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాయు కాలుష్యం కలిగించే నష్టాలను వివరంగా విశ్లేషించారు.

వాయు కాలుష్యం పెరుగుతోందంటే గాలిలో పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ ధూళి కణాల పరిమాణం అధికమవుతోందని అర్థం. పండుగల సమయంలో కాల్చే టపాసుల వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి హానికర వాయువులు కూడా ఈ గాలిలో కలుస్తాయి. "ఈ కాలుష్య కారకాలు శ్వాసనాళాల్లో చికాకును కలిగించి వాపు (ఇన్ఫ్లమేషన్) ప్రక్రియను ప్రేరేపిస్తాయి. పెద్ద పరిమాణంలో ఉండే ధూళి కణాలు ఎగువ శ్వాసకోశ భాగంలోనే చిక్కుకుపోతాయి. కానీ అత్యంత సూక్ష్మమైన కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి ప్రయాణించి చిన్న గాలిగొట్టాలు, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి," అని డాక్టర్ యాదవ్ వివరించారు. "పీఎం 2.5 కణాలు చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల అవి నేరుగా శ్వాసకోశ వ్యవస్థ లోతుల్లోకి చొచ్చుకుపోతాయి. కాబట్టి ఇవి మరింత ఆందోళనకరం. పదేపదే ఈ గాలిని పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు అధికమవుతుంది," అని ఆమె స్పష్టం చేశారు.

కలుషిత గాలికి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ఎలా తీవ్రమవుతాయో డాక్టర్ యాదవ్ వివరించారు: కాలుష్య గాలిని పీల్చినప్పుడు ఆస్తమా బాధితుల్లో కూతలు, దగ్గు, ఛాతీ బిగుతుగా పట్టేయడం, ఆయాసం వంటి లక్షణాలు పెరుగుతాయి. కాలుష్యం శ్వాసనాళాల్లో వాపును కలిగించి, ఇతర అలర్జీ కారకాలకు అవి మరింత సున్నితంగా మారేలా చేస్తుంది.
క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నవారికి ఆయాసం విపరీతంగా పెరగడం, దగ్గు ఎక్కువవడం, కఫం రంగు లేదా పరిమాణంలో మార్పులు రావడం వంటివి జరుగుతాయి. "వైద్య పరిభాషలో ‘ఎక్సాసర్బేషన్స్’ అని పిలిచే ఈ ఆకస్మిక తీవ్రత వల్ల కొన్నిసార్లు అత్యవసర వైద్య చికిత్స అందించాల్సి వస్తుంది, లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది," అని డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు. "అలర్జిక్ రైనైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ సున్నితత్వం ఉన్నవారికి నిరంతరం గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, దగ్గు వేధిస్తాయి. చిన్నారులు, వృద్ధులు, ఊపిరితిత్తుల సామర్థ్యం బలహీనంగా ఉన్నవారు ఈ కాలుష్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది," అని ఆమె తెలిపారు.

వాయు కాలుష్యం కలిగించే ముప్పు కేవలం తాత్కాలిక గొంతు నొప్పి, దగ్గుతో ఆగిపోదని డాక్టర్ యాదవ్ స్పష్టం చేశారు. "సూక్ష్మ ధూళి కణాలతో కూడిన కాలుష్యానికి దీర్ఘకాలం గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని, ఉన్న శ్వాసకోశ వ్యాధులు ముదురుతాయని, కొత్తగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఎపిడెమియోలాజికల్ ఆధారాలు నిరూపిస్తున్నాయి. పదేపదే శ్వాసనాళాల్లో వాపు రావడం వల్ల ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి వేగంగా ముదిరిపోతుంది," అని ఆమె వివరించారు. అయితే ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. గాలిలో కాలుష్య సాంద్రత, ఎంత సమయం ఆ గాలిలో గడిపారు, వ్యక్తి వయస్సు, శరీర తత్వం, అంతకుముందే ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి నష్టం ఆధారపడుతుంది. కలుషిత గాలికి గురైన ప్రతి ఒక్కరికీ శాశ్వతంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.

వాయు కాలుష్యం బారి నుంచి శ్వాసకోశ వ్యవస్థను రక్షించుకోవడానికి రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సప్నా యాదవ్ సూచించారు: రోజూ మీ ప్రాంతంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వివరాలను తనిఖీ చేయండి. కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు బయటి పనులను తగ్గించుకోండి. కాలుష్యం ఎక్కువగా ఉన్న వేళల్లో బయట కఠినమైన వ్యాయామాలు, పరుగు వంటివి చేయవద్దు. వ్యాయామం చేసేటప్పుడు వేగంగా ఊపిరి పీల్చడం వల్ల ఎక్కువ కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. కాలుష్యం గరిష్ట స్థాయికి చేరే సమయాల్లో ఇంటి కిటికీలను మూసి ఉంచండి. సరైన నిర్వహణలో ఉన్న ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్లను వాడండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా అమరే ఎన్95 మాస్క్ ధరించండి.

ఆస్తమా లేదా సీఓపీడీ బాధితులు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఇన్హేలర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. బయట గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది కదా అని సొంత నిర్ణయంతో మందులు ఆపడం లేదా డోస్ మార్చడం చేయకూడదు. ఆయాసం తగ్గకుండా కొనసాగినా, కూతలు ఎక్కువైనా, ఛాతీలో బిగుతుగా అనిపించినా, దగ్గు విపరీతంగా పెరిగినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

E-Paper

