విజయవాడలో వైభవంగా 'రాగా దాండియా ఉత్సవ్ 2.0' - నగరవాసులను ఉర్రూతలూగించిన వేడుకలు!
Raga Dandiya Utsav Vijayawada 2026 : విజయవాడలో వేగా జ్యువెలర్స్, వైబ్ ఈవెంట్స్ నిర్వహించిన 'రాగా దాండియా ఉత్సవ్ 2.0' ఘనంగా ముగిసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరం దసరా శరన్నవరాత్రుల వేళ భక్తిప్రపత్తులతో పాటు సాంస్కృతిక వైభవంతో శోభిస్తోంది. బెజవాడ సాంస్కృతిక రంగులను మరింత దేదీప్యమానం చేస్తూ జ్యువెలరీ బ్రాండ్ 'వేగా జ్యువెలర్స్' మరియు 'వైబ్ ఈవెంట్స్' సంయుక్తంగా నిర్వహించిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ అత్యంత వైభవంగా ముగిసింది. నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ అట్టహాస వేడుక విజయవాడ కళాత్మక హృదయాన్ని ఆవిష్కరిస్తూ….ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.

ఈ రంగుల ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సాంప్రదాయ దాండియా, గర్బా నృత్యాలతో పాటు సమకాలీన కళారూపాలను మేళవించి నిర్వహించిన ఈ వేడుకలో నగర యువత, మహిళలు, కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

వేడుకలో బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ సమర్పించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు పంజాబీ ధోల్ వాయిద్యాల నాదం, మరోవైపు ట్రెండీ డీజే పాటల సంగీత హోరు కలిసి కన్వెన్షన్ హాల్‌ను డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేసాయి. సాంప్రదాయ పట్టు వస్త్రాలు, వర్ణశోభితమైన దుస్తులు ధరించిన నగరవాసులు డీజే బీట్లకు అనుగుణంగా దాండియా రాడ్లు పట్టుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

రోజూవారీ వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొంది మనశ్శాంతిని పొందేందుకు ఈ దాండియా వేడుక ఎంతగానో దోహదపడిందని ప్రాంగణానికి విచ్చేసిన మహిళలు, యువత హర్షం వ్యక్తం చేశారు. గుజరాతీ సంస్కృతికి ప్రతీకైన గర్బాను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వేగా జ్యువెలర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి ఏటా నవరాత్రుల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ.. "నవరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. భక్తి, సాంప్రదాయం మరియు సమాజమంతా కలిసి జరుపుకొనే పవిత్రమైన వేడుక. విజయవాడ ప్రజల కళాభిరుచికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు," అని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, సనాతన విలువలను భవిష్యత్ తరాలకు అందిస్తూ, నగర ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఈ వేడుకను ప్లాన్ చేశామని తెలిపారు.

E-Paper

