ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఓవైపు భానుడి ప్రతాపం.... మరోవైపు ఈదురుగాలులతో వర్షాలు - ఇవాళ్టి అంచనాలు
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భానుడి భగభగలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతుండగా, వాతావరణ శాఖ ఒకే సమయంలో అటు వడగాల్పుల హెచ్చరికలను, ఇటు వర్ష సూచనను జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి భారీ మార్పులు ఉండవు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
(image istock)
ఏపీలోని మధ్య కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా నమోదు కానుంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
ఇవాళ(మే 26) ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో కూడా ఎండల వేడి బలంగా ఉంటుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కాకినాడ, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.
ఏపీలో ఎండలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపద్రవంగా మారిన వడగాల్పులు జనాలను మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave), మరో 137 మండలాల్లో సాధారణ వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(istock images)
తీవ్రమైన ఎండల నడుమ ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి మార్పుల వల్ల పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గాలి వేగంగా వీస్తుందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇవాళ(మే 26) ఖమ్మం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వడగాల్పుల పరిస్థితులు ఉంటాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
మే 27 నుండి 29 వరకు వర్షాల ప్రభావం మరింత విస్తరించనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి.
(image source @APSDMA)
E-Paper

