IPL playoffs scenario : ఉత్కంఠగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు! టాప్-4 జట్లు ఏవి?
IPL 2026 : హై-వోల్టేజ్ ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటోంది. ప్రతి జట్టుకు ఇంకొన్ని మ్యాచులో మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్లు ఏవని అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. మరి ఈ 10 జట్లలో.. ప్లేఆఫ్స్ రేసులో ఏ టీమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ తెలుసుకోండి..
ఆర్సీబీ- రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో (+1.103 నెట్ రన్ రేట్) పటిష్టంగా ఉంది. ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయం చేసుకోవాలంటే ఈ జట్టుకు మరోక విజయం చాలు! అయితే, నేరుగా ‘క్వాలిఫైయర్ 1’ ఆడి ఫైనల్‌కు రెండు అవకాశాలు పొందాలంటే మాత్రం ఆర్సీబీ.. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాప్-2లో నిలవాలి.
(REUTERS)
ఎస్ఆర్హెచ్- హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో ఆర్సీబీతో సమానంగా ఉన్నప్పటికీ, రన్ రేట్ (+0.737) తక్కువగా ఉండటం వల్ల రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ ఈ జట్టు ‘క్వాలిఫైయర్ 1’ స్థానాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
(AFP)
జీటీ- ఈ ఐపీఎల్ 2026లో అనూహ్యంగా పుంజుకుని అందరికి షాకిచ్చిన జట్టు ఈ గుజరాత్ టైటాన్స్! గుజరాత్ ఖాతాలోనూ 14 పాయింట్లు ఉన్నా, నెట్ రన్‌రేట్ (+0.228) ఆర్సీబీ కంటే తక్కువగా ఉంది. సేఫ్ జోన్‌లో ఉండాలంటే వీరు కనీసం రెండు విజయాలు సాధించాలి. మే 12న సన్‌రైజర్స్‌తో జరగనున్న పోరు గుజరాత్‌కు కీలకంగా మారనుంది.
(ANI Pic Service)
పంజాబ్ కింగ్స్- మిగిలిన జట్లతో పోలిస్తే పంజాబ్ మెరుగైన స్థితిలో ఉంది. వీరు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లే ఆడి 13 పాయింట్లు సాధించారు. చేతిలో ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిస్తే 17 పాయింట్లతో గ్యారెంటీగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటారు.
సీఎస్కే- ఐదుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 16 పాయింట్ల మార్కును చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాలి. ఒకవేళ 16 పాయింట్ల వద్ద నిలిచినా, వీరి రన్‌రేట్ (+0.185) తక్కువగా ఉండటం వల్ల ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి అన్ని మ్యాచ్‌లు గెలవడం చెన్నైకి అత్యవసరం.
(PTI)
ఆర్ఆర్- 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ పరిస్థితి చెన్నై కంటే దారుణంగా ఉంది! గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవడంతో ఈ జట్టు రన్‌రేట్ (+0.082) పడిపోయింది. నాలుగో స్థానం కోసం రాజస్థాన్ ప్రధానంగా చెన్నైతోనే పోటీ పడాల్సి ఉంటుంది.
కేకేఆర్- కేకేఆర్ ప్రయాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. వీరు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 17 పాయింట్లకు చేరాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
(PTI)
డీసీ- దిల్లీ క్యాపిటల్స్ జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉంది. గణితశాస్త్ర పరంగా అవకాశాలు ఉన్నప్పటికీ, రన్‌రేట్ (-1.154) అత్యంత దారుణంగా ఉండటం వారికి శాపంగా మారింది. డీసీ అద్భుతం చేసి అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడంతో పాటు మిగిలిన జట్లు ఘోరంగా ఓడిపోవాలని ఈ జట్టు అభిమానులు కోరుకోవాలి.
ఎంఐ, ఎల్ఎస్జీ- ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. ఆదివారం ఆర్సీబీ విజయంతో ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి.
E-Paper

