ఇలా చేయకపోతే.. జనవరి 1 నుంచి మీ వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్లు బంద్!
సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికామ్ శాఖ కొత్త 'సిమ్ బైండింగ్' నిబంధనలను తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు పనిచేయాలంటే రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఆన్‌లైన్ డిజిటల్ స్కామ్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్, అంతర్జాతీయ సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికామ్ శాఖ (డీఓటీ) కఠిన చర్యలు ప్రారంభించింది. దేశంలో అత్యధికంగా వాడే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లకు 'సిమ్ బైండింగ్' విధానాన్ని తప్పనిసరి చేస్తూ అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 డిసెంబర్ 31 నాటికి ఆయా టెక్ సంస్థలు ఈ సాంకేతికతను తమ యాప్‌లలో తీసుకురావాలని, 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మందిఈ వాట్సాప్, టెలిగ్రామ్‌లపైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఒకసారి ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత, ఫోన్ నుంచి సిమ్ తీసేసినా లేదా కేవలం వై-ఫై నెట్‌వర్క్ మాత్రమే వాడినా ఆ యాప్‌లు పనిచేస్తుంటాయి. ఈ సాంకేతిక వెసులుబాటునే విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. భారతీయ నంబర్లతో అకౌంట్లు తెరిచి, నకిలీ ఆఫీసర్ల పేరుతో బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. గడిచిన ఏడాదే దేశంలో రూ.22,800 కోట్లకు పైగా సైబర్ మోసాల వల్ల పౌరులు నష్టపోయారని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సిమ్ బైండింగ్ విధానం అమల్లోకి వస్తే, ఏ నంబర్‌తో అయితే మెసేజింగ్ యాప్ ఖాతా తెరిచారో ఆ నిర్దిష్టమైన సిమ్ కార్డ్ ఫోన్‌లోనే యాక్టివ్‌గా ఉండాలి. ఫోన్ నుంచి సిమ్ కార్డును తొలగించినా, డిసేబుల్ చేసినా లేదా వేరే సిమ్ మార్చినా వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు వెంటనే నిలిచిపోతాయి! మళ్లీ ఆ సిమ్ కార్డును ఫోన్‌లో వేస్తేనే యాప్ పనిచేస్తుంది. ఈ కొత్త నిబంధన పరిధిలోకి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, షేర్‌చాట్, జియోచాట్, జోష్, అరట్టై వంటి ప్లాట్‌ఫామ్‌లు వస్తాయి. కేవలం భారతదేశంలోనే వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నందున ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో వాట్సాప్ ఈ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది.
ఫోన్‌లో సిమ్ లేకుండా కేవలం వై-ఫై ద్వారా ట్యాబ్లెట్లు లేదా సెకండరీ ఫోన్లలో వాట్సాప్ వాడేవారు, విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయ సిమ్ తీసేసి స్థానిక లోకల్ సిమ్ కార్డులు వాడే ప్రయాణికులు, ఒకే ఫోన్‌లో తరచుగా సిమ్ కార్డులు మారుస్తూ ఉండే వ్యాపారులు, పౌరులు.. ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా రూల్స్‌తో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

అయితే వాట్సాప్ వెబ్ వాడుతున్న వారికి ప్రభుత్వం చిన్న ఊరటనిచ్చింది. గతంలో ప్రతి 6 గంటలకోసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలని భావించినప్పటికీ, వినియోగదారుల సౌకర్యార్థం ఆ నిబంధనను ఉపసంహరించుకుంది. దాని స్థానంలో "రిస్క్-బేస్డ్ లాగౌట్" (అనుమానాస్పద లాగిన్లు లేదా ముప్పు ఉన్నప్పుడు మాత్రమే లాగౌట్) విధానాన్ని ఖరారు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023, టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 కింద ఆయా కంపెనీలు ఈ నియమాలను అమలు చేయడం తప్పనిసరి. ఒకవేళ ఏ యాప్ అయినా ఈ నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ సర్వే ప్రకారం, ఈ మార్పు వల్ల 80 శాతం మంది వినియోగదారులు, 60 శాతం చిన్న వ్యాపారులు ప్రారంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డిసెంబర్ 31, 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, జనవరి 1, 2027 నుంచి సిమ్ ఉన్న ఫోన్లలో మాత్రమే ఈ యాప్‌లు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.

E-Paper

