USD vs INR : సెంచరీకి చేరువలో రూపాయి! ఆసియాలోనే అత్యంత అధ్వానమైన కరెన్సీ..
Rupee : ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతుండటంతో భారత రూపాయి విలువ సోమవారం చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 96.2275 మార్కును తాకి ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది.
సోమవారం (మే 18) నాటి ట్రేడింగ్ సెషన్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు ఇన్వెస్టర్లు భయపడటంతో రూపాయి విలువ సోమవారం దాదాపు 0.3 శాతం క్షీణించి 96.2275 వద్ద ఆల్‌టైమ్- లో రికార్డును నమోదు చేసింది. గతంలో నమోదైన 96.1350 కనిష్ట రికార్డును ఇది అధిగమించింది. వరసగా గత ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి రూపాయి విలువ ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయి పతనానికి గురవుతుండటం గమనార్హం. ఇతర ఆసియా మార్కెట్లతో పోల్చుకుంటే భారత రూపాయే అధ్వాన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి భారీగా డాలర్లను విక్రయించకపోతే రూపాయి పతనం మరింత ఘోరంగా ఉండేది. రూపాయికి రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ మార్కెట్ జోక్యంతో పాటు కొన్ని అరుదైన నియంత్రణ ఆంక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇటీవల దేశంలోకి వచ్చే అత్యధిక శాతం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ ఏకంగా 5.5 శాతం వరకు క్షీణించింది!
ప్రస్తుత పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ ‘బోఫా గ్లోబల్ రీసెర్చ్’ ఒక విశ్లేషణాత్మక నోట్ విడుదల చేసింది. "అంతర్జాతీయంగా చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే గరిష్ట స్థాయిల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రూపాయి విలువ మరింత బలహీనపడనుంది. మా అంచనాల ప్రకారం.. 2026 మధ్య నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96 మార్కుకు, అలాగే 2026 చివరి నాటికి 98 మార్కుకు పడిపోయే ప్రమాదం ఉంది." అని బోఫా అనలిస్టులు హెచ్చరించారు.
ఆర్థిక వృద్ధి రేటుపై ఉన్న ముప్పుల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో మళ్లీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అధిక హెడ్జింగ్ ఖర్చులు, దేశ ఆర్థిక లోటు పెరిగే ఆందోళనలు మరియు వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు అప్పుల రూపంలో వచ్చే పెట్టుబడులను కూడా దెబ్బతీస్తాయని నివేదిక స్పష్టం చేసింది. గణాంకాల ప్రకారం.. గడిచిన మార్చి నెల నుంచి ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లు, బాండ్ల నుంచి సుమారు 23.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు!
E-Paper

