ఫొటోలు : తిరుమలలో కార్తీక పౌర్ణమి దీపోత్సవ శోభ - వెయ్యి నేతి జ్యోతులతో వెలిగిపోయిన శ్రీవారి ఆలయం
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించింది. ఆలయ ప్రాంగణమంతా సుమారు వెయ్యి నేతి జ్యోతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.

పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 'కార్తీక పర్వ దీపోత్సవం' అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక పున్నమి రోజున శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ ఆధ్యాత్మిక వేడుకను కనులపండువగా నిర్వహించింది.

ఆలయ ప్రాంగణమంతా నేతి దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా మెరిసిపోగా, ఆ అపురూప దృశ్యాలను వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు.

సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత శాస్త్రోక్తంగా ఈ దీపోత్సవ కార్యక్రమం సాగింది. వేడుకలో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర వద్ద అర్చకులు కొత్త మూకుళ్లలో నేతి దీపాలను వెలిగించారు.

అనంతరం ఆ పవిత్ర దీపాలను ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలోని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లి హారతి సమర్పించారు.

ఆనంద నిలయంలో హారతి అనంతరం గర్భాలయంలోని అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య దీపాలను కొలువుదీర్చారు.

వీటితో పాటు ఆలయం వెలుపల ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, పవిత్ర స్వామి పుష్కరిణి వద్ద కూడా సుమారు వెయ్యి నేతి జ్యోతులను ఏర్పాటు చేశారు. ఆ దీపాల కాంతుల్లో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కార్తీక దీపోత్సవం నిర్వహణ నేపథ్యంలో టీటీడీ మంగళవారం పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ భాస్కర్, ఇతర ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

E-Paper
