Jailer 2 : సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్- జైలర్ 2 కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజూ!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న వీరాభిమానుల్లో భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఒకరు. 'తలైవా' లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ను వీక్షించేందుకు ఆయన ఏకంగా ఒక సినిమా థియేటర్‌ను పూర్తిగా బుక్ చేసి వార్తల్లో నిలిచారు!

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మైదానంలో తన విధ్వంసకర షాట్లతో అభిమానులను అలరిస్తుంటారు. అయితే, వెండితెరపై తనను అమితంగా ఆకట్టుకునే 'తలైవా' రజనీకాంత్‌పై శాంసన్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రజనీకాంత్ తాజాగా నటించిన ‘జైలర్ 2’ సినిమాను వీక్షించేందుకు సంజూ శాంసన్ ఏకంగా ఒక థియేటర్ మొత్తాన్ని బుక్ చేశారు!

దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమం వల్ల 'జైలర్ 2' సినిమా విడుదలైన మొదటి రోజు చూడలేకపోయానని శాంసన్ తెలిపారు. అయితే, ఆ మరుసటి రోజే తన భార్య చారులత, ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులతో పాటు భారత క్రికెట్ జట్టులోని తమిళ భాష తెలిసిన సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా థియేటర్ మొత్తాన్ని రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు.

"రజనీ సర్ సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. ఆయన కొత్త సినిమా విడుదలవుతోందంటే ఎంతగానో ఎదురుచూస్తాను. దిల్లీలో ఈవెంట్ ఉండటం వల్ల ఒక్క రోజు ఆలస్యంగా చూస్తున్నాను. ఈసారి ఎలాగైనా పెద్ద స్క్రీన్ పై చూడాలని థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాను. టీమ్‌లో తమిళం తెలిసిన సహచరులంతా నాతో కలిసి సినిమా చూసేందుకు వస్తున్నారు," అని సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన 'జైలర్ 2' చిత్రం 2023లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'జైలర్' కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ తనదైన శైలి యాక్షన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, నెల్సన్ వినూత్న టేకింగ్ వర్క్ అవుట్ అవ్వడంతో ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు

గత గురువారం విడుదలైన జైలర్ 2 సినిమాకు ఇండియాలోనే ఇప్పటివరకు రూ. 240కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాకు జైలర్ నిలిచింది.

E-Paper

