TG DOST Registrations 2026 : తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - నేటితో ముగియనున్న గడువు
TG DOST Phase 2 Registration Updates : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ (TG DOST) రెండో విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ గడువు నేటితో (మే 25) ముగియనుంది. అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి(మే 25)తో ముగియనుంది.
మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, సీటు వచ్చినా నచ్చని వారు, అలాగే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. కాబట్టి ఇవాళ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు… వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా, నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లను కూడా త్వరితగతిన నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు.
దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్‌లో మొదటిసారిగా పాల్గొనే కొత్త అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొదటి ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా, కాలేజీలను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు) మే 26 వరకు తుది అవకాశం కల్పించారు.
మొదటగా టీజీ దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
హోం పేజీలో అందుబాటులో ఉన్న "Candidate Pre-Registration" లింక్‌పై క్లిక్ చేయండి.
ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి దోస్త్ ఐడీ (DOST ID) జెనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు పేమెంట్ లింక్ ద్వారా రూ. 400 రుసుము చెల్లించాలి. లాగిన్ ఐడీ, పిన్ నంబర్ ఉపయోగించి అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా పూరించాలి.. అనంతరం వెబ్ ఆప్షన్ల ద్వారా మీకు నచ్చిన కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి.
దోస్త్ రెండో విడతలో విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మే 30న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ (Online Self-Reporting) చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నిర్ణీత గడువు లోపు రిపోర్ట్ చేయని పక్షంలో వారికి దక్కిన సీటు స్వయంచాలకంగా రద్దవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
E-Paper

