తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు : వైభవంగా గరుడసేవ - వర్షాన్ని సైతం లెక్కచేయక తరలివచ్చిన భక్తజనం, ఫొటోలు
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వర్షంలోనూ వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.

ఉత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి వేడుకల్లో కెల్లా అత్యంత ప్రధానమైన గరుడ వాహనసేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలాలంకృతుడై శ్రీ మలయప్పస్వామివారు సర్వాలంకార భూషితుడై భక్తులకు అభయప్రదానం చేశారు.

రాత్రి 6.30 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య మంగళ రూపాన్ని ప్రసాదించారు. గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాల మధుర నినాదాలు, ఆధ్యాత్మిక భజనలు, ఉత్సాహపూరిత కోలాటాలు, శ్రీవైష్ణవ జీయ్యంగార్ల తిరుప్పావై ఘోషల నడుమ గరుడసేవ అత్యంత కోలాహలంగా సాగింది.

మాడవీధుల్లో అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు పడుతూ, ఉచ్చరిస్తున్న "గోవిందా.. గోవిందా" నామస్మరణతో సప్తగిరులు మార్మోగిపోయాయి.

మధ్యాహ్నం నుంచి తిరుమల కొండపై వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహానికి, భక్తిభావానికి ఏమాత్రం అడ్డంకి కలగలేదు. కురుస్తున్న చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు మాడవీధుల గ్యాలరీల్లో గంటల తరబడి ఓపికగా వేచి ఉండి, స్వామివారి గరుడ వాహనసేవను కళ్లారా వీక్షించి తరించారు.

గ్యాలరీల్లో ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నిరంతరాయంగా వేడివేడి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వర్షం పడుతున్నా తమకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

వైష్ణవ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనసేవకు పరమ పవిత్రమైన ప్రాధాన్యం ఉంది. భగవంతునికి నిత్యదాసుడు, పరమ భక్తుడైన గరుడాళ్వారుపై శ్రీనివాసుడు కొలువుదీరి విహరించడం భక్తి, సంపూర్ణ శరణాగతికి నిదర్శనంగా నిలుస్తుంది.

గరుడ వాహనంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దివ్య రూపంలో శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.

E-Paper

