Srivari Navaratri Brahmotsavams Pics : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు
తిరుమల శ్రీవారు ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుమల మాడ వీధులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

ధనుర్భంగం (సీతా స్వయంవరం) ఘట్టాన్ని తలపిస్తూ శ్రీవారు శ్రీరామచంద్ర మూర్తి, అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమివ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది.

స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోవింద నామస్మరణలతో మాడ వీధులు మార్మోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.

ముత్యాలు చల్లదనం, ప్రశాంతతకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముత్యపుపందిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరించే శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని కలిగిస్తుంది.

ఈ దివ్యదర్శనంతో మనశ్శాంతి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జానకీ దేవి, రంగశ్రీ, నరేష్ కుమార్, జేఈవో (హెచ్ అండ్ ఈ) గోపినాథ్, సీవీఎస్వో కే.వీ. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

E-Paper

