వందే భారత్ స్పీడ్‌కి సమానంగా దూసుకెళ్లిన పాత ఎక్స్‌ప్రెస్ రైలు! రైల్వే అధికారులే షాక్
దక్షిణ రైల్వేకు చెందిన ఐకానిక్ 'వైగై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్' మరోసారి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దారిపొడవునా ఆలస్యంగా నడిచినప్పటికీ.. వందే భారత్ తరహాలో గంటకు 110 కి.మీ వేగంతో దూసుకెళ్లి చెంగల్ పట్టు - మదురై మధ్య 430 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల ముందే చేరుకుని సరికొత్త అధ్యాయం లిఖించింది.

భారతీయ రైల్వే చరిత్రలో ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పిన అత్యంత పాపులర్ రైలు 'వైగై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్' (Vaigai Superfast Express). తాజాగా ఈ రైలు సాధించిన విజయం చూసి తోటి ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు సైతం నోరెళ్లబెడుతున్నారు! ప్రయాణం మధ్యలో తీవ్ర ఆటంకాలు, రైల్వే ట్రాక్ లైన్ పనుల వల్ల ఆలస్యం ఎదురైనప్పటికీ.. ఏకంగా రెండు గంటల సమయాన్ని కవర్ చేస్తూ గమ్యస్థానానికి అనుకున్న సమయానికే చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది. సాధారణంగా తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి మదురై మధ్య 430 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి సాధారణ వేగంతో 7 గంటల 35 నిమిషాల సమయం పడుతుంది. కానీ వైగై ఎక్స్‌ప్రెస్ మాత్రం ఆధునిక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో గంటకు 110 కిలోమీటర్ల తుపాను వేగంతో దూసుకెళ్లి, కేవలం 5 గంటల 35 నిమిషాల్లోనే ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.

దక్షిణ రైల్వే సమగ్ర వివరాల ప్రకారం.. అక్టోబర్ 24న చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరాల్సిన వైగై ఎక్స్‌ప్రెస్, షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ వెంటనే కోడంబాక్కమ్ సమీపంలో ట్రాక్ నిర్వహణ పనులు, మార్గమధ్యంలో ఆటంకాల కారణంగా మరో 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. దీనితో ఆరంభంలోనే దాదాపు అర గంటకు పైగా ప్రయాణం వెనుకబడింది. అయితే, తాంబరం స్టేషన్‌కు మధ్యాహ్నం 2:25 గంటలకు చేరుకుని, 2:30 గంటలకు బయలుదేరిన తర్వాత ఈ రైలు అసలు సిసలైన విశ్వరూపం చూపించింది! తాంబరం నుంచి బయలుదేరిన వైగై ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టును మధ్యాహ్నం 2:58 గంటలకు దాటింది. అక్కడి నుంచి విల్లుపురం వరకు ఉన్న 103 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కేవలం 1 గంట 4 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది!

విల్లుపురం స్టేషన్‌లో మదురై డివిజన్‌కు చెందిన లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైలు మరింత వేగం పుంజుకుంది. దారిపొడవునా గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నిలకడగా కొనసాగిస్తూ, రాత్రి 8:37 గంటలకే మదురై జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్ 7కు సురక్షితంగా చేరుకుంది. క్రమం తప్పకుండా రైళ్ల వేగాలను విశ్లేషించే ప్రయాణికుడు అరుణ్ పాండియన్ ఈ అసాధారణ పర్ఫార్మెన్స్‌ను వివరిస్తూ.. చెన్నై - విజయవాడ రూట్‌లో నడిచే రాజాధాని ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ రైళ్లు సాధించే స్పీడ్ రికార్డులతో వైగై ఎక్స్‌ప్రెస్ పర్ఫార్మెన్స్‌ను పోల్చారు. ట్రాక్ క్లియరెన్స్ సరిగ్గా ఉండి, లోకో పైలట్లు సమర్థవంతంగా పనిచేస్తే పాత కాలపు సూపర్‌ఫాస్ట్ రైళ్లు కూడా సెమీ హైస్పీడ్ రైళ్లకు గట్టి పోటీ ఇవ్వగలవని ఇది నిరూపించిందన్నారు.

వైగై ఎక్స్‌ప్రెస్ ఇలా లేట్‌గా ప్రారంభమై ముందే చేరుకోవడం ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో మార్చి 3, 2022న కూడా మదురైలో ఉదయం 7:05 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాంకేతిక లోపం వల్ల 21 నిమిషాలు ఆలస్యంగా 7:26 గంటలకు బయలుదేరింది. కానీ తన అద్భుత వేగంతో రాబోయే సమయాన్ని కవర్ చేస్తూ, సాధారణంగా చేరుకోవాల్సిన మధ్యాహ్నం 2:30 గంటల కంటే ముందుగానే అంటే మధ్యాహ్నం 2:07 గంటలకే చెన్నై ఎగ్మోర్ చేరుకుని రికార్డు సృష్టించింది.

ఆగష్టు 15, 1977న చెన్నై - మదురై నగరాల మధ్య ఈ వైగై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ రైలు పేరు మీద ఎన్నో అరుదైన ఘనతలు ఉన్నాయి. భారతీయ రైల్వే చరిత్రలోనే మీటర్ గేజ్ ట్రాక్‌పై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తొలి రైలు వైగై ఎక్స్‌ప్రెస్. మీటర్ గేజ్ రైళ్లలో ప్రయాణికులకు వేడి వేడి ఆహారాన్ని అందించే 'పాంట్రీ కార్' సౌకర్యాన్ని పొందిన మొదటి రైలు కూడా ఇదే.

994లోనే మీటర్ గేజ్ ట్రాక్‌పై 42 సీట్ల ఏసీ కోచ్‌ను ఇందులో ప్రవేశపెట్టారు. 2019లో దక్షిణ రైల్వే ఈ రైలుకు అత్యంత సురక్షితమైన, మోడ్రన్ లింకే హాఫ్మన్ బుష్ కోచ్‌లను అమర్చి ప్రయాణ అనుభవాన్ని మరింత హాయిగా మార్చింది. ఏది ఏమైనా, వందే భారత్ ఎరాలోనూ తనదైన వేగంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రయాణికుల మనస్సు దోచుకుంటోంది తమిళనాడుకు చెందిన ఈ ఐకానిక్ ‘వైగై ఎక్స్‌ప్రెస్’!

E-Paper

