ఎయిర్టెల్ vs జియో vs వొడాఫోన్ ఐడియా.. ఎందులో 'స్పామ్' బెడద తక్కువో తెలుసా?
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ట్రాయ్ కీలక నివేదిక విడుదల చేసింది. 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చిన స్పామ్ ఫిర్యాదులు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంటే తక్కువగా నమోదయ్యాయి.
ట్రాయ్ క్యూ2 నివేదిక ప్రకారం, 2026 సెప్టెంబర్ 30 నాటికి రిలయన్స్ జియోకు 52.72 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కు 50.67 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 20.08 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో జియో నెట్వర్క్ నుంచి బయటకు వెళ్లిన కాల్స్, ఎస్ఎంఎస్లపై 2,93,716 ఫిర్యాదులు అందాయి. ఇదే సమయంలో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌పై 3,52,062 ఫిర్యాదులు రాగా, తక్కువ మంది కస్టమర్లు ఉన్న వొడాఫోన్ ఐడియాపై ఏకంగా 5,39,285 ఫిర్యాదులు నమోదయ్యాయి! వీటిలో చర్యలు తీసుకోవడానికి వీలైన ఫిర్యాదులు జియోలో 1,72,622 ఉండగా, ఎయిర్‌టెల్‌లో 1,86,013, వొడాఫోన్ ఐడియాలో 3,19,629గా ఉన్నాయి.

స్పామ్ ఫిర్యాదులు అందిన తర్వాత టెలికాం సంస్థలు తీసుకున్న చర్యల వివరాలను కూడా ట్రాయ్ బయటపెట్టింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జియో కఠినంగా వ్యవహరించి 4,963 టెలికాం వనరులను (నంబర్లు/కనెక్షన్లు) ఏడాది పాటు డిస్కనెక్ట్ చేసింది. ఈ విషయంలో ఎయిర్టెల్ మరింత దూకుడుగా 7,889 కనెక్షన్లను తొలగించగా, వొడాఫోన్ ఐడియా కేవలం 355 కనెక్షన్లపైనే వేటు వేసింది. స్పామ్ మెసేజ్‌లు పంపే 274 మంది సెండర్లను జియో ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది; ఎయిర్టెల్ 85 మందిని, వొడాఫోన్ ఐడియా కేవలం 9 మందిని మాత్రమే బ్లాక్‌లిస్ట్ చేశాయి. అదనంగా జియో 1,506 ఎస్ఎంఎస్ సెండర్లను బ్లాక్ చేయగా, ఎయిర్టెల్ 882, వొడాఫోన్ ఐడియా 770 సెండర్లను నిలిపివేశాయి.

తమ నెట్వర్క్ నుంచి ఇతరులకు వెళ్లే స్పామ్ కాల్స్ తక్కువగా ఉన్నప్పటికీ, బయటి నెట్‌వర్క్‌ల నుంచి తమ ఫోన్లకు స్పామ్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారిలో జియో వినియోగదారులే ముందున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జియో కస్టమర్లు 6,96,283 ఫిర్యాదులు చేశారు. ఎయిర్టెల్ వినియోగదారులు 6,43,546 ఫిర్యాదులు చేయగా, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 1,38,736 ఫిర్యాదులు నమోదు చేశారు. ఆయా కాల్స్ వచ్చిన అసలు నెట్‌వర్క్‌లకు తదుపరి చర్యల కోసం జియో 6,50,038 ఫిర్యాదులను పంపగా, ఎయిర్టెల్ 6,35,420, వొడాఫోన్ ఐడియా 1,37,182 ఫిర్యాదులను ఫార్వర్డ్ చేశాయి.
అనవసరపు కాల్స్ రాకుండా మొబైల్ వినియోగదారులు 'డూ నాట్ డిస్టర్బ్' (DND) సేవలను యాక్టివేట్ చేసుకునే విషయంలో వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ముందున్నారు. సెప్టెంబర్ 30 నాటికి వొడాఫోన్ ఐడియా వినియోగదారులలో 32.7 శాతం మంది డీఎన్డీలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎయిర్‌టెల్‌లో ఈ సంఖ్య 17.2 శాతంగా ఉండగా, జియోలో కేవలం 10.7 శాతం మంది మాత్రమే డీఎన్డీని ఎంచుకున్నారు.

మొత్తం మీద జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో కలిపి 714.01 బిలియన్ కాల్స్ జరగగా, స్పామ్ కాల్స్‌పై 15.29 లక్షల ఫిర్యాదులు ట్రాయ్‌కు అందాయి. వీటిలో 7,23,831 ఫిర్యాదులు చర్యలకు అర్హమైనవిగా గుర్తించారు. విశేషమేమిటంటే, మొత్తం ఫిర్యాదులలో 92.9 శాతం అంటే 14.21 లక్షల ఫిర్యాదులు ‘ట్రాయ్ డీఎన్డీ యాప్’ ద్వారానే వచ్చాయి. స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు ఈ యాప్‌ను విరివిగా వాడుతున్నారని దీనిని బట్టి స్పష్టమవుతోంది. అన్ని ఆపరేటర్ల పరిధిలో కలిపి 1.24 లక్షలకు పైగా టెలికాం వనరులపై చర్యలు తీసుకోగా, 374 మంది సెండర్లను పూర్తిగా బ్లాక్‌లిస్ట్ చేశారు. అవుట్గోయింగ్ సేవలను నిలిపివేయడం, ఎస్ఎంఎస్ హెడర్లను బ్లాక్ చేయడం వంటి కఠిన నిర్ణయాలతో స్పామ్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది.

E-Paper

