Walking : బరువు తగ్గేందుకు రోజుకు 10 వేల అడుగుల నడక.. మోకాళ్లకు ప్రమాదమా?
రోజుకు 10,000 అడుగులు నడవాలనే లక్ష్యం సాధారణ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో మోకాళ్ల అరుగుదల (ఆస్టియోఆర్త్రైటిస్) ప్రమాదాన్ని నివారించడానికి నిపుణులు ఇస్తున్న సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువు తగ్గడానికి రోజుకు 10,000 అడుగులు నడవాలనేది చాలామంది పెట్టుకునే ప్రామాణిక లక్ష్యం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శరీరంలో చురుకుదనాన్ని పెంచడానికి నడక ఎంతో మేలు చేస్తుందనేది వాస్తవమే. అయితే, మోకాళ్ల విషయానికి వస్తే 'ఎక్కువగా నడవడమే ఎల్లప్పుడూ మంచిది' అనే సూత్రం వర్తించదని గురుగ్రామ్‌లోని మణిపాల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ గుర్‌దీప్ అవినాష్ రాత్రా స్పష్టం చేస్తున్నారు.

శరీరానికి వ్యాయామం అవసరమే అయినప్పటికీ, మోకాళ్ల ఆస్టియోఆర్త్రైటిస్ ఉన్నవారికి పరిమితికి మించిన నడక హాని కలిగిస్తుంది. "కీళ్ల వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకుంటే మోకాళ్లను కాపాడుకుంటూనే చురుగ్గా ఉండవచ్చు," అని డాక్టర్ రాత్రా స్పష్టం చేశారు. చాలామంది మోకాళ్ల నొప్పులను వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యగానో లేదా ఫిజికల్ యాక్టివిటీ వల్ల వచ్చే అలసటగానో భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ముందస్తు హెచ్చరికలను పసిగడితే కీళ్లు మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

నడిచే సమయంలో లేదా నడిచిన తర్వాత మోకాళ్లలో నిరంతరం నొప్పి రావడం, ఉదయం పూట లేచినప్పుడు లేదా ఎక్కువ సేపు కూర్చుని నిలబడినప్పుడు మోకాళ్లు పట్టేయడం వంటివి కీళ్ల అరుగుదలకు తొలి సంకేతాలు. వీటితో పాటు మోకాళ్ల చుట్టూ వాపు రావడం, మెట్లు ఎక్కడం లేదా కుర్చీలో నుంచి లేవడం కష్టంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైన దశకు చేరినప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా మోకాళ్ల నొప్పి వేధిస్తుంది. అధిక శరీర బరువు మోకాళ్ల కీళ్లపై అదనపు ఒత్తిడిని పెంచడం వల్ల అవి త్వరగా దెబ్బతింటాయి. గతంలో తగిలిన మోకాళ్ల గాయాలు, నిరంతరం వంగి లేదా మోకాళ్లపై కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కూడా కీళ్లను దెబ్బతీస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గాట్ వంటి జీవక్రియ సమస్యలు ఉన్నవారు, వారసత్వంగా ఆర్థరైటిస్ చరిత్ర ఉన్నవారు, తొడ కండరాలు బలహీనంగా ఉన్నవారికి మోకాళ్ల అరుగుదల వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మోకాళ్లను రక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు 5 మార్గాలు- శరీర బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల మోకాళ్ల కీళ్లపై పడే భారం తగ్గుతుంది. ఇది ఆస్టియోఆర్త్రైటిస్ తీవ్రతరం కాకుండా అడ్డుకుంటుంది. కీళ్లకు తీవ్రమైన ఒత్తిడి ఇవ్వని స్విమ్మింగ్ (ఈత), సైక్లింగ్, సాధారణ నడక వంటి వ్యాయామాలను ఎంచుకోవాలి. ఒకేసారి 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించకుండా, రోజుకు 5,000 నుంచి 7,000 అడుగులతో ప్రారంభించి క్రమంగా పెంచుకోవడం ఆచరణాత్మకమైన మార్గం.

తొడలు, తుంటి, కాళ్ల కండరాలను బలంగా ఉంచుకోవడం వల్ల నడిచేటప్పుడు పడే షాక్‌లను ఆ కండరాలు గ్రహించి మోకాళ్లకు స్థిరత్వాన్ని ఇస్తాయి. లిగమెంట్ టేర్, కార్టిలేజ్ గాయాలు అయినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మోకాళ్ల అరుగుదలను నివారించవచ్చు.

E-Paper

