బీపీ టాబ్లెట్ ఒక్క రోజు వేసుకోవడం మర్చిపోతే శరీరానికి ఏమవుతుంది? వైద్యుల హెచ్చరిక..
హై బ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడుతున్నవారు రోజూ వాడే బీపీ మందులను ఒక్క రోజు వేసుకోకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మర్చిపోయినప్పుడు రెట్టింపు డోస్ వేసుకోవచ్చా? ఈ విషయాలపై వైద్యులు చెబుతున్న పూర్తి వివరాలనుఇక్కడ తెలుసుకోండి..

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి వైద్యులు సూచించిన బీపీ మాత్రలను చాలా మంది ప్రతినెలా క్రమం తప్పకుండా వాడుతుంటారు. అయితే, హడావుడిలోనో లేదా మరచిపోయి సాధారంగా ఒకటి లేదా రెండు రోజులు టాబ్లెట్ వేసుకోరు. ఇలా బీపీ మందులు వేసుకోవడం ఆపేస్తే శరీరంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? తక్షణమే ఏం చేయాలి? అనే విషయాలను ప్రముఖ గుండె నిపుణులు క్షుణ్ణంగా విశ్లేషించారు.

సాధారణంగా ఒక్క డోస్ బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే రక్తపోటు తాత్కాలికంగా కాస్త పెరుగుతుంది. చాలామందికి ఒక్క రోజు మర్చిపోవడం వల్ల తక్షణమే పెద్ద ప్రమాదమేమీ జరగదు. ఈ సమయంలో కొందరికి తలనొప్పి రావడం, కళ్లు తిరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ, చాలామందిలో ఎలాంటి శారీరక లక్షణాలు బయటకు కనిపించవు. లక్షణాలు లేవు కదా అని బీపీ సాధారణంగా ఉందనుకోవడం పెద్ద పొరపాటు.

వారంలో రెండు మూడు రోజులు లేదా తరచూ బీపీ మాత్రలను వేసుకోవడం మర్చిపోతుంటే అది దీర్ఘకాలికంగా శరీర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది! నిరంతరం బీపీ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల గోడలు గట్టిపడి, సాగే గుణాన్ని కోల్పోతాయి. గుండె రక్తప్రసరణ చేయడంలో విఫలమై హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం అధిక రెట్లు పెరుగుతుంది! మెదడులోని సన్నని రక్తనాళాలు పగిలిపోవడం లేదా బ్లాక్ అవ్వడం వల్ల శాశ్వతంగా పక్షవాతం రావచ్చు. హై బీపీ వల్ల మూత్రపిండాల్లో ఉండే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని, కిడ్నీలు పనిచేయడం ఆగిపోయే ముప్పు ఉంది.

ఏదైనా కారణం చేత మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా? అయితే మీరు రోజువారీగా వేసుకునే సమయానికి ఇంకా చాలా సమయం ఉండి, మర్చిపోయిన విషయం గుర్తుకు వస్తే వెంటనే ఆ టాబ్లెట్ వేసుకోండి. ఒకవేళ మీ తదుపరి డోస్ వేసుకునే సమయానికి కేవలం 3 లేదా 4 గంటల సమయం మాత్రమే ఉంటే, మర్చిపోయిన పాత టాబ్లెట్‌ను వదిలేసి, నిర్ణీత సమయానికే తదుపరి డోస్ తీసుకోండి. మర్చిపోయాను కదా అని ఒకేసారి రెండు టాబ్లెట్లు వేసుకోవడం అత్యంత ప్రమాదకరం! దీనివల్ల బీపీ హఠాత్తుగా పడిపోయి ప్రాణాలకే ముప్పు రావచ్చు. టాబ్లెట్ మర్చిపోయిన సమయంలో కంగారు పడకుండా, తీవ్రమైన వ్యాయామాలు లేదా పరుగెత్తడం వంటి పనులు చేయకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి.

బీపీ టాబ్లెట్ మర్చిపోయిన తర్వాత.. ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా పట్టినట్లు అనిపించడం, ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం రావడం, తలలో విపరీతమైన తలనొప్పి తలెత్తడం, ముఖం, చేతులు లేదా శరీరంలో ఒకవైపు భాగం మొద్దుబారడం, బలహీనపడటం, మాటలు తడబడటం లేదా చూపు మసకబారడం వంటివి ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించాలి.

E-Paper

