Banks : ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్- కారణం ఇదే..
బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 27 ఆదివారం రోజున కూడా ప్రభుత్వ రంగ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తెరిచి ఉంచాలని ఆదేశించింది.
ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చేపడుతున్న మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె దృష్ట్యా ప్రజలు తీవ్ర అవస్థలు పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాబోయే సెప్టెంబర్ 27, ఆదివారం రోజున కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. ఆ రోజున అన్ని బ్యాంక్ శాఖలు, ఏటీఎంలతో అనుసంధానమైన బ్రాంచ్‌లు, కరెన్సీ చెస్ట్‌లు, అధికారిక కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి మంజూరు చేసింది.
డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) సాధారణ సెలవులు కావడంతో పాటు, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు సమ్మె జరగనుంది. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడితే నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, సాధారణ లావాదేవీలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ సమస్యను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేక అనుమతినిచ్చింది. ఆదివారం రోజున బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం ఆధారిత శాఖలు, కరెన్సీ చెస్టులన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా, సమ్మె వల్ల ఇబ్బంది రాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు సెప్టెంబర్ నెల వేతనాలు, పెన్షన్లను ముందస్తుగానే విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేది దేశంలోని ఏడు ప్రధాన బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాల ఉమ్మడి వేదిక. AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC వంటి ప్రముఖ సంఘాలు దీని పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం బ్యాంకింగ్ సిబ్బందిలో దాదాపు 90 శాతం మందికి ఈ వేదిక ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఈ వివాదానికి ముఖ్యంగా ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు కాకపోవడమే కారణం. 2024 మార్చి 8న జరిగిన ద్విపాక్షిక ఒప్పందంలో దీనిపై అంగీకారం కుదిరినప్పటికీ, ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనితో పాటు.. వారానికి 5 రోజుల పనిదినాలు: ప్రస్తుతం మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తున్నాయి. అలా కాకుండా ప్రైవేట్, ఐటీ సంస్థల తరహాలోనే అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. పిఎల్ఐ (PLI) స్కీమ్ పునఃసమీక్ష: పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంలో మార్పులు లేదా దాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబడుతున్నారు. సిబ్బంది కొరత - పనిభారం: శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదివరకే సెప్టెంబర్ 11న నిర్వహించిన ఒక్క రోజు సమ్మెలో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొనగా, రూ.2,500 కోట్ల లావాదేవీలపై ప్రభావం పడింది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
E-Paper

