Child health : వాతావరణం మారగానే పిల్లలకు పదేపదే జ్వరం, జలుబు ఎందుకు వస్తాయి?
సీజన్ మారే సమయంలో పిల్లలు పదేపదే అనారోగ్యానికి గురికావడానికి కేవలం వాతావరణ మార్పులే కారణం కాదని ప్రముఖ పిల్లల వైద్యులు వెల్లడించారు. పిల్లల రోగనిరోధక శక్తి, గాలి ఆడకపోవడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీల మధ్య వ్యత్యాసాలను ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకోండి..
వాతావరణంలో సంభవించే మార్పులు నేరుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవని కైలాష్ హాస్పిటల్ పీడియాట్రీషియన్ డాక్టర్ అంకుర్ చౌలా స్పష్టం చేశారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో పరిపక్వత చెందకపోవడమే ప్రధాన కారణం. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు మారినప్పుడు ముక్కు, గొంతులో ఉండే సహజ రక్షణ కవచాలు బలహీనపడతాయి. మన శ్వాసకోశ వ్యవస్థను కాపాడే శ్లేష్మం, సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాలను (సిలియా) పొడి గాలి, చల్లదనం దెబ్బతీస్తాయి. దీనివల్ల క్రిములు సులభంగా లోపలికి చేరుకుని వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.
బయట వాతావరణం బాగోలేదని తల్లిదండ్రులు పిల్లలను గదుల్లోనే ఉంచేస్తుంటారు. అయితే కిటికీలు మూసివేసి పిల్లలను ఎక్కువసేపు ఒకే గదిలో లేదా ఇంట్లో ఉంచడం వల్ల వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. పాఠశాలలు, డే కేర్‌లు లేదా మూసున్న గదుల్లో పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు ఫ్లూ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, సాధారణ జలుబు త్వరగా సోకుతాయి. తుమ్ములు, దగ్గు ద్వారా వచ్చే బిందువులు, మురికి చేతుల ద్వారా ఈ వైరస్‌లు వేగంగా సంక్రమిస్తాయి.
పిల్లలకు ముక్కు కారడం, దగ్గు రావడం ప్రతిసారీ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. గాలిలో దుమ్ము, ధూళి, పొల్లెన్ లేదా తేమ శాతంలో మార్పుల వల్ల ‘అలర్జిక్ రైనైటిస్’ వచ్చే అవకాశం ఉంది. "వరుసగా తుమ్ములు రావడం, ముక్కు దిబ్బడ వేయడం, కళ్ల వెంట నీళ్లు తిరగడం, ముక్కు నుంచి పలచటి నీరు కారడం అలర్జీ లక్షణాలు. అదే జ్వరం, తీవ్రమైన అలసట ఉంటే అది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్‌గా గుర్తించాలి," అని డాక్టర్ అంకుర్ చౌలా వివరించారు.
పిల్లల దినచర్యపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. వేళాపాళా లేని నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. నిరంతరం సరైన నిద్ర, పౌష్టికాహారం, తగినంత మంచినీళ్లు తాగించడం అత్యంత ముఖ్యం. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా, వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. అలాగే సమయానికి వ్యాక్సిన్లు వేయించడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.
పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడటం, ఎడతెరిపి లేకుండా వాంతులు కావడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం (తగినంత మూత్రం రాకపోవడం), పెదవులు నీలం రంగులోకి మారడం, అసాధారణమైన అలసట లేదా తీవ్రమైన మగతగా ఉండటం, తగ్గినట్టే తగ్గి వ్యాధి లక్షణాలు మళ్లీ తీవ్రం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
E-Paper

